Rahul Campaign in Telangana : ప్రశ్నలు సంధిస్తూ... ఆత్మీయ రాగాన్ని వినిపిస్తూ
Rahul Gandhi Campaign in Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ… రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు పర్యటించారు. సభలు, సమావేశాల్లో మాట్లాడిన ఆయన… ఓవైపు అధికార బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే…మరోవైపు తెలంగాణ ప్రజలను మనసును కదిలించే ప్రయత్నం చేశారు.
Rahul Gandhi Telangana Tour : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం రసవత్తరంగా మారుతోంది. అగ్రనేతల రాకతో… డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ జాబితా విడుదల కాగా… తొలి జాబితాతో కాంగ్రెస్ కూడా ఓ అడుగులు ముందుకేసింది. బీజేపీ అభ్యర్థుల జాబితా కూడా ఖరారు కానుంది. ఇదిలా ఉంటే… ఈసారి తెలంగాణ గడ్డపై హస్తం జెండా ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్… పక్కగా అడుగులు వేసే పనిలో పడింది. అభ్యర్థుల ఎంపికతో మొదలు… ప్రచారం సరళి వరకు గతానికి భిన్నంగా కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో… రాహుల్ గాంధీని తెలంగాణకు రప్పించిన రాష్ట్ర నాయకత్వం… ఏకంగా మూడు రోజలపాటు బస్సు యాత్రను నిర్వహించి ఉత్తర తెలంగాణలోని నేతలు, కార్యకర్తల్లో జోష్ ను నింపే ప్రయత్నం చేసింది.
ఓవైపు విమర్శలు… మరోవైపు ఆత్మీయ రాగం
మూడు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ… కీలక అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు.ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను నేరవెర్చకుండా… మోసం చేసిందని, ప్రజల తెలంగాణ కాకుండా, దొరల తెలంగాణగా మార్చిందని పదే పదే చెప్పారు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటే అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే… రాష్ట్రంలోని బీఆర్ఎస్ ను కార్నర్ చేసేశారు రాహుల్ గాంధీ. ప్రధానంగా రుణమాఫీ, ఇళ్ల పథకం, ధరణ భూ సమస్యలు, భూనిర్వాసితులతో పాటు నిరుద్యోగం అంశాలను తన ప్రసంగాల్లో ఎక్కువగా ప్రస్తావించారు. ఇక తాము చెప్పిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని… స్పష్టం చేశారు. ఫలితంగా ప్రజలకు ఓ బలమైన నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని…. ఆ తుపాన్ లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందనే ధీమాను నేతలు, కార్యకర్తల్లో నింపారు.
మరోవైపు తన ప్రచారంలో ఆత్మీయ రాగాన్ని గట్టిగా వినిపించారు రాహుల్ గాంధీ. ఇందిరాగాంధీతో మొదలు ఇవాళ్టి వరకు తెలంగాణ ప్రజలతో తమ కుటుంబానికి ప్రేమపూర్వక సంబంధం ఉందన్నారు. తమకు తెలంగాణ అంటే ఎంతో ప్రేమ అని…. రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించినప్పటికీ సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలను ఇవ్వడానికి తాను ఇక్కడికి రాలేదని… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవెర్చటమే మా లక్ష్యమని అన్నారు.
ఇక బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే… తెలంగాణలో కుల గణన చేపడుతామని చెప్పుకొచ్చారు. ఓబీసీలకు 50 శాతం కంటే అధిక ప్రాధాన్యమివ్వాలని… ఆ అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇక ఆర్మూరులో పర్యటించిన రాహుల్ గాంధీ… ప్రత్యేకంగా పసుపు రైతుల సమస్యలను ప్రస్తావించారు. పసుపు బోర్డు విషయంలో బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక క్వింటా పసుపు ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు రైతుకు దక్కేలా చూస్తామని హామీనిచ్చారు.
మరోవైపు దక్షిణ తెలంగాణతో పోల్చితే… ఉత్తర తెలంగాణలో పార్టీ మెరుగుపడాల్సి ఉందని కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో… రాహుల్ టూర్ తో సమీకరణాలు మారుతాయని అంచనా వేస్తోంది. తన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సింగరేణి కార్మికులతో పాటు టీ కొట్టు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడిన వారి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తంగా చూస్తే… రాహుల్ పర్యటనతో జోష్ లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు… సరికొత్త ఉత్సహంలో ఎన్నికల ప్రచారంలోకి దిగాలని చూస్తున్నారు.