Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి.. 17 క్వింటాళ్లు స్వాధీనం-police seized 17 quintals of ganja in nalgonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి.. 17 క్వింటాళ్లు స్వాధీనం

Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి.. 17 క్వింటాళ్లు స్వాధీనం

HT Telugu Desk HT Telugu
Oct 24, 2024 01:55 PM IST

Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. రోజురోజుకూ గంజాయి కేసులు పెరుగుతున్నాయి. కిలోల కొద్ది గంజాయి పట్టుబడుతోంది. ఇప్పటి వరకు పోలీసుల దాడుల్లో 17 క్వింటాళ్ల గంజాయి దొరికింది. దీంతో మిషన్ పరివర్తన్ ద్వారా అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి (HT)

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గంజాయి గుప్పుమంటోంది. పోలీసు, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక ఆపరేషన్లు ఎన్ని చేపట్టినా.. జిల్లాకు ఏదో ఒక మార్గాన గంజాయి చేరుతూనే ఉంది. గంజాయి దమ్ముకు అలవాటు పడిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంపై పోలీసు శాఖ శ్రద్ధ పెడుతోంది. మిషన్ పరివర్తన్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ప్రత్యేక కిట్లు..

గంజాయికి అలవాటు పడి యువత మత్తులో చిత్తు కాకుండా మిషన్ పరివర్తన్ ఉపయోగపడుతోంది. మందుబాబులను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకపట్టినట్టే గంజాయి తాగిని వారిని ప్రత్యేకంగా ‘ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్ట్ కిట్స్’ను ఉపయోగించి దొరకపడుతున్నారు. ఈ కిట్లను వాడి యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా గంజాయికి బానిసలుగా మారిన వారిని గుర్తించి తొలి దశలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత కూడా మళ్లీ ఎవరన్నా గంజాయి తాగి దొరికితే వారిని డిఅడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స చేయిస్తున్నారు. జిల్లా యంత్రంగా ఇప్పటికే వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రచార పోస్టర్లు, ఇతర మార్గాల్లో గంజాయి నివారణకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లకు ప్రత్యేకంగా ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్ట్ కిట్లను అందజేశారు.

హైదరాబాద్ విజయవాడలను కలుపుతున్న జాతీయ రహదారి ఉమ్మడి జిల్లా పరిధిలో కోదాడ నుంచి చౌటుప్పల్ సరిహద్దుల వరకు ఉంది. దీంతో ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గంజాయి తేలిగ్గా రవాణ అవుతోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని జాతీయ రహదారిపై నిఘా పెంచారు. దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మందు బాబులతో పాటు, గంజాయి దమ్ము కొట్టిన వారూ పట్టుబడుతున్నారు.

17 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం..

ఇప్పటిదాకా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాడుల్లో, అకస్మిక తనిఖీల్లో 17,126 కేజీల గంజాయి దొరికింది. దీనికి సంబంధించి మొత్తం 123 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. ఇందులో నల్గొండలో 805 కేజీల గంజాయి పట్టుబడగా, గంజాయి వ్యాపారాలు, రవాణా దారులపై 30 కేసులు నమోదు అయ్యాయి.

సూర్యాపేట జిల్లాలో 657 కేజీల గంజాయి దొరకగా, 50 కేసులు నమోదు అయ్యాయి. యాదాద్రి భువనగిరి 2,506 కేజీల గంజాయి దొరికింది. దీనికి సంబంధించి 43 కేసులు పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుగా హైదరాబాద్ ఉండడం ఒక కారణంగానే చెబుతున్నారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి వరంగల్ జిల్లా మీదుగా హైదరాబాద్ కు గంజాయి రవాణా అవుతున్నట్టు గుర్తించారు.

ఇక ఉమ్మడి జిల్లాలో గంజాయికి అలవాటు పడినవారు 327 మంది పోలీసులకు చిక్కారు. వీరికి మిషన్ పరివర్తన్ ద్వారా అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా వీరిలో కొందరు మళ్లీ గంజాయి తాగుతున్నట్లు చెబుతున్నారు. ఇలా రెండోసారి పట్టుబడిన వారిలో ఆరుగురిని డి అడిక్షన్ సెంటర్‌కు పంపించారు. జిల్లాలో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు శాఖ చేపడుతున్న మిషన్ పరివర్తన్ కార్యక్రమాలు కొంత ఫలితాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తున్నా.. గంజాయి సరఫరా మాత్రం నిలిచిపోక పోవడం గమనార్హం.

(రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner