Mission Parivartan : గంజాయి మత్తు వదిలిస్తున్నారు..! నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న 'మిషన్ పరివర్తన్ '-mission parivartan is going on with the aim of eradicating drugs in nalgonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mission Parivartan : గంజాయి మత్తు వదిలిస్తున్నారు..! నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న 'మిషన్ పరివర్తన్ '

Mission Parivartan : గంజాయి మత్తు వదిలిస్తున్నారు..! నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న 'మిషన్ పరివర్తన్ '

HT Telugu Desk HT Telugu
Sep 05, 2024 10:39 PM IST

మాదక ద్రవ్యాలపై నల్గొండ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి రావటంతో… దూకుడుగా ముందుకెళ్తున్నారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చటమే లక్ష్యంగా “మిషన్ పరివర్తన్” కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ' మిషన్ పరివర్తన్ '
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ' మిషన్ పరివర్తన్ '

నల్లగొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా “మిషన్ పరివర్తన్” కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. పోలీసు యంత్రాంగం విస్తృతంగా తనిఖీలు చేపడుతుండడంతో గంజాయి తాగుతున్న వారు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు.

ఇటీవలే డ్రగ్స్ టెస్టింగ్ కిట్స్ పోలీసులకు అందడం ఫలితాలను ఇస్తోంది. ఇటీవల కొద్ది రోజుల్లోనే.. మిర్యాలగూడ పోలీస్ సబ్ డివిజన్ పరిదిలో గంజాయి సేవిస్తూ 130 మంది పట్టుబడ్డారు.

యువతకోసం మిషన్ పరివర్తన్

గంజాయి మత్తుకు అలవాటు పడిన యువతను దారిలోకి తెచ్చేందుకు జిల్లా పోలీసు శాఖ మిషన్ పరివర్తన్ కార్యక్రమం చేపడుతున్నారు. గంజాయి తాగి పోలీసులకు బపట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రులను పిలిపించి ఉమ్మడిగా కౌన్సిలింగ్ ఇస్తయన్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మిషన్ పరివర్తన్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిదిలో ప్రతి రోజు గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా టెస్టులు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ డివిజన్ లో గంజాయి సేవించి పట్టుబడ్డ 130 మంది యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలో మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.

మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 130 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైక్రియాటిస్ట్డా క్టర్ విజయ్ కుమార్ తో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.

బానిస అయితే జీవితాలు నాశనం

యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్క సారి వీటికి బానిసైతే జీవితంలో కోలుకోవడం చాలా కష్టం అవుతుందని యువతకు వివరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో మాదక ద్రవ్యాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచారు.

ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. ఒక్క సారి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే దాని ప్రభావం శరీరంలో 6 నెలల వరకు ఉంటుంది. తెలిసీ తెలియక మొదటి సారిగా సేవించి పట్టుబడిన వారికి మిషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా మారడానికి అవకాశం కల్పిస్తున్నారు. రెండవ సారి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడుతే 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఒక్క సారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలకు అనర్హులు అవుతారన్న అంశానికి ఎక్కువ ప్రచారం ఇస్తున్నారు.

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం

జిల్లాలో మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు, వాటి వినియోగం పై ఉక్కు పాదం మోపుతున్నారు. ఎవరైనా మాదకద్రవ్యాలు అమ్మినా సరఫరా చేసినా, సేవించినట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 గాని వాట్స్ అప్ నంబర్ 8712670266 గాని, సంబంధిత పోలీస్ స్టేషన్ కి గాని సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )