Palakurthi Congress : పాలకుర్తి కాంగ్రెస్ లో కుమ్ములాట, ఎంపీ ఎలక్షన్స్​వేళ పార్టీలో గ్రూప్ వార్-palakurthi congress internal fight party leaders protest against mla mother in law jhansi reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Palakurthi Congress : పాలకుర్తి కాంగ్రెస్ లో కుమ్ములాట, ఎంపీ ఎలక్షన్స్​వేళ పార్టీలో గ్రూప్ వార్

Palakurthi Congress : పాలకుర్తి కాంగ్రెస్ లో కుమ్ములాట, ఎంపీ ఎలక్షన్స్​వేళ పార్టీలో గ్రూప్ వార్

HT Telugu Desk HT Telugu
Mar 23, 2024 10:07 PM IST

Palakurthi Congress : పాలకుర్తి కాంగ్రెస కుమ్ములాట మొదలైంది. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్త కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా స్థానిక నిరసనలకు దిగారు. ఝాన్సీరెడ్డి పార్టీని రెండుగా చీల్చుతున్నారంటూ ఆరోపిస్తు్న్నారు.

పాలకుర్తి కాంగ్రెస్ లో కుమ్ములాట
పాలకుర్తి కాంగ్రెస్ లో కుమ్ములాట

Palakurthi Congress : అసెంబ్లీ ఎన్నికల సమయంలో హాట్​ టాపిక్​ గా నిలిచిన పాలకుర్తి నియోజకవర్గంలో (Palakurthi)రాజకీయ పరిణామాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు హిస్టరీ క్రియేట్​చేయగా.. అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్​ పార్టీలో ఎంపీ ఎలక్షన్స్ (Lok Sabha Elections)సమీపిస్తున్న వేళ అంతర్గత పోరు నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్​ పార్టీ దేవరుప్పుల మండల అధ్యక్షుడిని తొలగించి, ఆ పదవిని ఇంకో వ్యక్తికి అప్పగించడంతో హస్తం పార్టీలో రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే అత్తగారైనా ఝాన్సీరెడ్డి (Jhansi Reddy)నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చుతున్నారంటూ కొందరు నేతలు నాలుగు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనకారులు శనివారం హైదరాబాద్​ కు కూడా తరలివెళ్లారు. దీంతో పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్​ పార్టీలో అంతర్యుద్ధం నడుస్తుండగా.. నిరసనలు కారణం అధ్యక్ష పదవి మార్పా.. లేక ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే చర్చ నడుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో హాట్​ సెగ్మెంట్​

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హాట్​ సెగ్మెంట్​ గా నిలిచింది. ఇక్కడ ఓటమి ఎరుగని నేత, వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా నెగ్గిన ఎర్రబెల్లి దయాకర్​రావు బీఆర్ఎస్(BRS)​ నుంచి పోటీ చేయగా.. ఆయనపై కాంగ్రెస్​ నేత ఝాన్సీరెడ్డి కోడలు యశస్వినీరెడ్డి పోటీ చేసి ఆయనను చిత్తుగా ఓడించారు. కాగా ఎన్నికలకు ముందు ఎర్రబెల్లి దయాకర్​ రావు కోవర్టు రాజకీయాలతో ఝాన్సీరెడ్డిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నేతలను సైతం ఎర్రబెల్లి తన వైపు తిప్పుకుని కోవర్టులుగా వినియోగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా కోవర్ట్ రాజకీయాలకు పాలకుర్తి ప్రజలు బై బై చెప్పడంతో పాలకుర్తి గడ్డపై మొదటిసారి కాంగ్రెస్ జెండా ఎగరగా.. ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఎర్రబెల్లిని ఓడించి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి యశస్వినీరెడ్డి హిస్టరీ క్రియేట్​ చేశారు.

మండల అధ్యక్ష పదవి మార్పుతో రగడ

పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్(Palakurthi Congres)​ దేవరుప్పుల మండల అధ్యక్షుడి మార్పుతో కాంగ్రెస్​ పార్టీలో చిచ్చు మొదలైంది. కాంగ్రెస్​ దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా ఉన్న కృష్ణమూర్తి గౌడ్ ను ఇటీవల ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తొలగించి ఆ బాధ్యతలు నల్ల శ్రీరాంకు అప్పగించారు. దీంతో కృష్ణమూర్తి అధ్యక్ష పదవి తొలగింపును నిరసిస్తూ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కొందరు నాలుగు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నూతన మండల అధ్యక్షుడిగా ఎంపికైన నల్ల శ్రీరామ్ రెండ్రోజుల కిందట మండల పార్టీ కార్యాలయంలోకి రావడంతో కృష్ణమూర్తి వర్గీయులు అడ్డుకొని గొడవకు దిగారు. సూర్యాపేట రహదారిపై బైఠాయించి ధర్నా కూడా నిర్వహించారు. మరుసటి రోజు కృష్ణమూర్తి అనుచరుడు సెల్ టవర్ ఎక్కి ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కృష్ణమూర్తి తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్ర ఝాన్సీ రెడ్డి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే శనివారం దేవరుప్పుల మండలం నుంచి దాదాపు 50 వాహనాల్లో కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ కు తరలివెళ్లారు.

తెరవెనుక ఓ కాంగ్రెస్​ నేత ఉన్నారనే ప్రచారం

ఎర్రబెల్లి ఓటమి తరువాత పాలకుర్తిలో కాంగ్రెస్​ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఒక్క మండల అధ్యక్షుడి మార్పుతో గందరగోళం ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు పాలకుర్తిలో ఎర్రబెల్లిపై(Errabelli Dayakar) పోటీ చేసేందుకు విముఖత చూపిన ఓ కాంగ్రెస్ నేత తిరిగి పాలకుర్తిలో అడుగుపెట్టేందుకు చూస్తున్నారని, ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం మండల అధ్యక్ష పదవిని తొలగిస్తేనే ఈ స్థాయిలో నిరసనలు, ధర్నాలు జరగడం పట్ల కూడా కొందరు పార్టీ నాయకులు ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి(Jhansi Reddy) ప్రాబల్యాన్ని తగ్గిస్తే నియోజకవర్గంపై తాను పట్టు నిలుపుకోవచ్చన్న ఎజెండాతోనే కృష్ణమూర్తి గౌడ్ అంశాన్ని అదునుగా చేసుకొని ఆ నేత పావులు కదుపుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో తేల్చుకోవాల్సిన అంశం ఏకంగా గాంధీభవన్ వద్ద నిరసనకు దారి తీయడం.. ఝాన్సీ రెడ్డిని బద్నాం చేసే కుట్రలో భాగమేననే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలోని ఓ మాజీ మంత్రితో పాటు కాంగ్రెస్​ పార్టీకి చెందిన నేత ఒకరు కలిసే కార్యకర్తలను హైదరాబాద్​ కు పంపించారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామాలు జరగడంతో పార్టీ బలహీనపడే అవకాశాలు ఉండగా.. అధిష్టానం ఇక్కడి పరిస్థితి ఏ విధంగా చక్కదిద్దుతుందో చూడాలి.

తగిన నిర్ణయం తీసుకుంటాం- కాంగ్రెస్​వర్సింగ్​ప్రెసిడెంట్​

పాలకుర్తి(Palakurthi Congress) నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం గాంధీ భవన్(Nampally Gandhi Bhavan) ఎదుట ఆందోళన చేపట్టడంతో పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్​ గౌడ్​ స్పందించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, పాలకుర్తి ఎమ్మెల్యేకు మధ్య సఖ్యత లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. మండల అధ్యక్షులను తొలగించే బాధ్యత జిల్లా అధ్యక్షులకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఝాన్సీరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నట్టుగా తమ దృష్టికి రాలేదన్నారు. ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య సఖ్యత ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, పాలకుర్తి విషయంలో అన్ని వివరాలు పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటామని మహేశ్​ కుమార్​గౌడ్​ స్పష్టం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన కార్యకర్తలు శాంతించి, అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

IPL_Entry_Point