TS Assembly Elections 2023 : మరోసారి ఆసక్తికరంగా 'మునుగోడు' రాజకీయం - ఈసారి టికెట్లు ఎవరికో..?
Munugode Assembly Constituency: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి మునుగోడు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎవరు ఖరారవుతురానే చర్చ జోరుగా నడుస్తోంది.
Munugode Assembly Constituency: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ చర్చకు తెరలేపిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల చుట్టూ ముచ్చట్లు నడుస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్నాళ్లకు ఆ పార్టీని వీడడంతో పాటు కాంగ్రెస్ బి ఫామ్ పై గెలిచానంటూ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక తప్పలేదు. ఆ ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఓటమి పాలైతే, తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ మాత్రం మూడో స్థానంలో నిలిచింది. బీజేపీ కేంద్ర నాయకత్వం సవాలుగా తీసుకున్న మునుగోడు ఎన్నిక ఒక విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆకర్శించింది. తాజాగా ఇపుడు ఆ నియోజకవర్గం చుట్టూ జరుగుతన్న రాజకీయాలు మరో సారి చర్చనీయాంశం అవుతున్నాయి.
ఏమిటీ... కొత్త కథ
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంత యాక్టివ్ గా రాజకీయా కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఈ సారి ఆయన అదే మునుగోడు నుంచి అదే బీజేపీ టికెట్ పోటీ చేస్తారా..? లేదా..? అన్న అంశంపైనా స్పష్టత లేదు. అయినా, మునుగోడు బీజేపీలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా టికెట్ కోసం ప్రయత్నించే వారు కానీ, కావాలని కొట్లాడే వారు కానీ కనిపించడం లేదు. ఒక విధంగా బీజేపీ మునుగోడు టికెట్ రాజగోపాల్ రెడ్డికి రిజర్వు చేసినట్టే లెక్క.
ఉప ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి గెలిచిన బీఆర్ఎస్ లో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇంకా ఇంటి పోరు తగ్గలేదు. ఇప్పటికే పార్టీ నాయకత్వం టికెట్ ప్రకటించినా.. బీసీ నినాదంతో పనిచేసిన ముగ్గురు నాయకులు ఇక్కడి నుంచి టికెట్ ఆశించి, ఆ కల నెరవేరక తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇపుడు వారంతా తమ అభ్యర్థికి మనస్ఫూర్తిగా సహకరిస్తారన్న గ్యారెంటీ కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరో వైపు కాంగ్రెస్ లో వర్గపోరు సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి.. తిరిగి పార్టీలో కొనసాగిన పాల్వాయి స్రవంతి మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఉప ఎన్నికల సమయంలోనే నియోజకవర్గ నాయకునిగా అవతరించిన చలమల్ల క్రిష్ణారెడ్డి అనే నేత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దగ్గరి అనుచరునిగా ఉన్నారు. ఉప ఎన్నికల్లోనే ఆయన టికెట్ ఆశించినా.. నల్లగొండ కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టలేని నిస్సాహయ స్థితిలో ఇక్కడి సీనియర్ల మాటకు తలొగ్గిన రేవంత్ రెడ్డి పాల్వాయి స్రవంతిని పోటీకి దింపారు. అయితే, సాధారణ ఎన్నికల్లో చలమల్ల క్రిష్ణారెడ్డికి టికెట్ ఇస్తామన్న లోపాయికారి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలు ముగిసిన నాటి నుంచే క్రిష్ణారెడ్డి నియోజకవర్గంలో కార్యక్రమాలు, పాదయాత్రలు చేపట్టారు. కానీ, తీరా ఇపుడు టికెట్లకు దరఖాస్తు చేసుకునే సమయానికి పాల్వాయి స్రవంతి కూడా టికెట్ కోసం పోటీకి వచ్చారు. బీసీ నేతగా తనకూ అవకాశం ఇవ్వాలని పున్న కైలాస్ నేత కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ టికెట్ విషయంలో పీఠముడి పడినట్టే కనిపిస్తోంది.
మాజీ మంత్రిగా, మాజీ రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున ఆయన అయిదు సార్లు గెలిచారు..) వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన పాల్వాయి స్రవంతికి ఏఐసీసీ స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయన్న ధీమాతో ఉన్నా.. కేంద్ర స్థాయిలో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో సీపీఐ కూడా ఉండడంతో.. రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తో పోత్తు దాదాపు ఖాయమంటున్నారు. ఇదే జరిగితే.. సీపీఐ కచ్చితంగా అడిగే స్థానాల్లో మునుగోడు ఒకటి.
సీపీఐ .. ఏం చేయనుంది..?
నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత రెండు ఉప ఎన్నికలు సహా ఇప్పటి వరకు 17 సార్లు జరిగిన ఎన్నికల్లో .. 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ సహా సీపీఐ ఇక్కడి నుంచి ఏడు సార్లు గెలచింది. మరో ఎనిమిది పర్యాయాలు కాంగ్రెస్ విజయం సాధించగా ఒక ఉప ఎన్నిక సహా బీఆర్ఎస్ రెండు విజయాలు దక్కించుకుంది. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకునే తమకు పట్టున్న నియోకవర్గంగా అటు సీపీఐ, ఇటు కాంగ్రెస్ భావిస్తాయి. ఈ సారి ఈ ఇరు పార్టీ ల మధ్య పొత్తు దాదాపు ఖాయమనుకుంటున్న తరుణంలో సీపీఐ పోటీకి సిద్దమవుతోంది. మరో వామపక్ష పార్టీ సీపీఎం కు కూడా ఈ నియోజవకర్గంలో కనీసం పది వేల ఓట్లు సాధించేంత బలం ఉంది. ఇది సీసీఐకి అదనపు బలం కానుంది.
ఇంకో వైపు కాంగ్రెస్ లో మాత్రం టికెట్ పోరు జరుగుతోంది. ఈ పోరే సీపీఐకి కలిసి వస్తుందన్నఅభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే బీజేపీని ఎదుర్కొనేందుకంటూ సీపీఎం, సీపీఐ పార్టీలు బీఆర్ఎస్ తో జతకట్టాయి. ఈ ఉప ఎన్నికల సమయంలో ఈ పార్టీల మధ్య పొత్తు పొడిచింది. బీఆర్ఎస్ విజయంలో వామపక్షాల భాగస్వామ్యం కూడా ఉందన్నది కాదనలేని అంశం. కాగా, బీఆర్ఎస్ కు వామపక్షాల మధ్య స్నేహం మూణ్నాళ్ల ముచ్చటగా మిగలడంతో.. పాత స్నేహం తిరిగి చిగురించి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నాయి. మొత్తంగా ఇపుడు మునుగోడు వేదికగా మరో మారు ఆసక్తికరమైన రాజకీయాలకు ఆస్కారం కనిపిస్తోంది.