Waranagl News : అర్ధనగ్నంగా చేసి... వృద్ధురాలి దారుణ హత్య
Waranagl District News : వరంగల్ నగరంలో దారుణం జరిగింది. 68 ఏళ్ల వృద్ధురాలిని అర్ధనగ్నంగా చేసి అత్యంత దారణంగా హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు… పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Waranagl Crime News : వరంగల్ నగరంలో దారుణం జరిగింది. కాజీపేటలోని రహమత్ నగర్ కు చెందిన ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. వృద్ధురాలి స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండగా.. హత్యకు సంబంధించి వివిధ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కాజీపేట రహమత్ నగర్ లో ఉంటున్న కన్నె విజయ(68) కొంతకాలంగా పైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తోంది. మృతురాలి భర్త ఐదు సంవత్సరాల క్రితమే మరణించగా, ఆమె కొడుకు స్థానికంగా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. కాగా ఫైనాన్స్ దందా చేస్తున్న విజయ డబ్బుల విషయంలో ఖరాఖండీగా వ్యవహరిస్తూ ఉండేది. ఇదిలాఉంటే గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె.. రాత్రి 10 దాటినా ఇంటికి చేరలేదు. దీంతోనే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో వాకబు చేశారు. చుట్టుపక్కల తెలిసిన వారి ఇళ్లలో కూడా గాలించారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో వెంటనే కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అర్ధనగ్నంగా చేసి..
విజయ కనిపించకపోవడంతో ఫిర్యాదు చేసిన అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి నిద్రపోయారు. కాగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలో కుక్కలు మొరగసాగాయి. ఎంతకూ ఊరుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి బయటకు వెళ్లి చూశారు. దీంతో కాలనీలో నడిరోడ్డుపై విజయ విగతజీవిగా కనిపించింది. అది చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు వెంటనే కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. విజయ మృతదేహం అర్ధనగ్నంగా ఉండటం చూసి షాక్ అయ్యారు. అంతేగాకుండా ఆమె మెడలో ఉండాల్సిన గోల్డ్ చైన్, రెండు చేతి ఉంగరాలు, చెవి కమ్మలు.. ఇలా దాదాపు రూ.లక్షకు పైగా విలువ చేసే నగలు కనిపించకపోవడంతో ఇదంతా దోపిడీ దొంగల పని కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తుండటం, డబ్బుల ఖరాఖండీగా వసూలు చేసే వ్యక్తి కావడంతో ఆమె వద్ద అప్పు తీసుకున్నవారెవరైనా విజయను హత్య చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హత్య నుంచి పోలీసులను డైవర్ట్ చేయడానికే వృద్ధురాలిని అర్ధనగ్నంగా మార్చారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించే పనిలో పడ్డారు. కాగా విజయ ఉండే ఇంటి గల్లీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ పక్కన ఉన్న ఏరియాల్లో ఉన్న కెమెరాలను పరిశీలించే పనిలో పడ్డారు. వరంగల్ నగరంలో ఏదో ఒకరకంగా తరచూ మర్డర్లు జరుగుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.