Stray Dog Attack: కాజీపేటలో విషాదం..వీధికుక్కల దాడికి బాలుడు బలి-boy killed in stray dog attack at kazipet in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Stray Dog Attack: కాజీపేటలో విషాదం..వీధికుక్కల దాడికి బాలుడు బలి

Stray Dog Attack: కాజీపేటలో విషాదం..వీధికుక్కల దాడికి బాలుడు బలి

HT Telugu Desk HT Telugu
May 19, 2023 02:49 PM IST

Warangal Crime News: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కాజీపేట రైల్వేక్వార్టర్స్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Boy Killed in Stray Dog Attack: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వేసవి నేపథ్యంలో... ఇష్టానుసారంగా దాడులకు దిగుతున్నాయి. తాజాగా ఓ చిన్నారిపై దాడి చేయటంతో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేక్వార్టర్స్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీకి చెందిన దంపతులు అజ్మీర్‌ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూ (8)తో కాజీపేట రైల్వేస్టేషన్‌కు వచ్చారు. సంచార జాతులైన వీరు వంట చేసుకునేందుకు రైల్వేస్టేషన్‌ పక్కనే ఉన్న ప్రాంతానికి గురువారం రాత్రి చేరుకున్నారు.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లాడు కుమారుడు చోటు. ఈ క్రమంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు బాలుడిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. బాలుడు ఎంత అరిచినా ఎవరికీ వినిపించకపోవడంతో కుక్కలు బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తమ్ముడి వద్దకు వచ్చిన సోదరి రోదన ప్రతీ ఒక్కరిచేత కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రిచటంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటూ విమర్శించారు. వెంటనే వీధి కుక్కల బెడదను తప్పించాలని… అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Street Dogs Killed young Boy: కొద్దిరోజుల కిందట నాలుగేళ్ళ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ చిన్నారి చనిపోయాడు. హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ గా మారాయి. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. జీహెచ్ఎంసీ వైఫల్యం కారణంగానే బాలుడి ప్రాణాలు పోయాయంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం… పలు చర్యలకు ఉపక్రమించింది. ప్రత్యేకంగా మార్గదర్శకాలను కూడా రూపొందించింది. 

కుక్కల బెడదను నియంత్రించే విషయంలో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది రాష్ట్ర మున్సిపల్ శాఖ. ముఖ్యంగా స్టెరిలైజేషన్ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది.  మార్గదర్శకాలు చూస్తే…

పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ను తీసుకురావటం.

కుక్కల కుటుంబ నియంత్రణ వేగవంతం చేయడం.

కుక్క కాటు ప్రమాదాల నియంత్రణకు చర్యలు.

ఎకువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టడం.

నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పెంపుడు కుక్కలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం.

నగర, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్లమ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్స్‌, టౌన్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్స్‌ , రెసిడెంట్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టడం.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, చికెన్‌ , మటన్‌ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయటం.

జీహెచ్ఎంసీ పరిధి లో హెల్ప్ లైన్ నెంబర్ 04021111111 తీసుకురావటం.

కాలనీ సంఘాలు, బస్తిలలో వచ్చే నెల రోజులు కుక్క కాటు పై అవగహన కల్పించటం.

ఇకపై పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డులు ఇచ్చే చర్యలు.

వీధి కుక్కల దత్తత తీసుకోవడం పై అవగహన చర్యలు విస్తృతం చేయటం.

వీధి కుక్కల అంశంపై హోర్డింగ్స్,పోస్టర్స్, బిల్ బోర్డ్స్ తో ప్రచారం చేయటం.

వేసవి దృష్ట్యా వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా నీటి వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవటం.