Telangana Govt : టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ - గడువు ఇదే
TSPSC Latest News: టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు జనవరి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.
TSPSC Latest News: తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. మరోవైపు గత ప్రభుత్వంలో నియమితులైన ఛైర్మన్ తో పాటు పలువురు సభ్యులు కూడా రాజీనామా చేశారు. వీరి రాజీనామాలకు గవర్నర్ కూడా ఆమోదం పలకటంతో… కమిషన్ లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని తక్షణమే భర్తీ చేసి… ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియమాకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన వారు జనవరి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. www.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సర్కార్ సూచించింది. పూర్తి చేసిన దరఖాస్తులను 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపాలని తెలిపింది. అర్హతలకు సంబంధించిన వివరాలను కూడా నోటిఫికేషన్ లో వివరించింది.
TSPSC Resignations: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్థన్ రెడ్డితో పాటు ఇతర సభ్యుల రాజీనామాలకు ఇటీవలే గవర్నర్ తమిళసై అమోదం తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. సమీక్ష నిర్వహించిన రోజే కమిషన్ ఛైర్మన్ తన రాజీనామాను గవర్నర్‌కు అందచేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షలతో పాటు కమిషన్ నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ వ్యవహారాల్లో దర్యాప్తు కొనసాగుతున్నందున రాజీనామాలను గవర్నర్ అమోదించలేదు. ఈ వ్యవహారంపై కమిషన్ సభ్యుల రాజీనామాలను అమోదించాలని సిఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే…రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదలైంది.