MLC Kavitha : బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి-mlc kavitha appeals to sc to intervene in bilkis bano case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha : బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి

MLC Kavitha : బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి

Anand Sai HT Telugu
Aug 18, 2022 06:01 PM IST

MLC Kavitha : బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

<p>ఎమ్మెల్సీ కవిత</p>
ఎమ్మెల్సీ కవిత

అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన నిందితులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులను విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపిస్టులకు స్వాగతం చెప్పడం సమాజానికి చెంపపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో గర్భవతి అయిన బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను ఆగస్టు 15న రెమిషన్ విధానం కింద విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

రేపిస్టులు, జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని క్షమించరాదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ వీరి విడుదల జరిగిందని కవిత ప్రస్తావించారు. బిల్కిస్ బానో బాధపడ్డారని, ఇకపై ఏ మహిళ బాధపడకూడదని అన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఐదు నెలల గర్భిణీ బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన వారిని, ఆమె 3 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన వారిని విడుదల చేయడం దారుణమని కవిత అన్నారు. బీజేపీ ప్రభుత్వం అవివేకాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధం మాత్రమే కాదని, మానవత్వానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

“ఒక మహిళగా బిల్కిస్ బానో అనుభవించిన బాధ, భయాన్ని అర్థంచేసుకోగలను. రేపిస్టులు, హంతకులు జైలు నుంచి విడుదలయ్యాక ఒక భావజాలాన్ని అనుసరించే కొందరు వ్యక్తులు స్వాగతించడం సమాజానికి చెంపపెట్టు. అత్యంత ప్రమాదకరమైన ఈ సంప్రదాయం వారసత్వంగా రూపుదిద్దుకోకముందే దాన్ని ఆపడం తప్పనిసరి.' అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఈ విషయంపై మంత్రి కేటీఆర్ బుధవారం డిమాండ్ చేశారు. 'మహిళలను గౌరవించడం గురించి మీరు మాట్లాడేది నిజమైతే.. 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేయించండి.' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Whats_app_banner