Pilot Rohit Reddy : భాగ్యలక్ష్మి ఆలయానికి రోహిత్ రెడ్డి.. బండి సంజయ్ ఎక్కడ?
Pilot Rohit Reddy : బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బండి సంజయ్, రఘు నందన్ రావు చేసిన ఆరోపణలపై ఎక్కడికి రమ్మన్న వస్తానని స్పష్టం చేశారు.
డ్రగ్స్ కేసులో తనపై చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) పైలట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు. అంతకుముందు చెప్పినట్టుగానే.. ఆదివారం ఉదయం.. పది గంటలకు ఛార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి(Charminar Bhagyalaxmi Temple) ఆలయానికి వచ్చారు. అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం రోహిత్ రెడ్డి మాట్లాడారు.
'బీజేపీ నేతలు(BJP Leaders) నాపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. బండి సంజయ్(Bandi Sanjay), రఘునందన్ రావు మీరు నాపై చేసిన ఆరోపణలపై ఎక్కడికి రమ్మన్న వస్తా. దీనికి మీరు సిద్ధమైతే చెప్పండి. వేములవాడ(Vemulawada) లేదా తాండూరు బద్రేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడికి వచ్చినా నేను రెడీ. ఈడి నోటీసుల విషయంలో మా న్యాయవాదులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తా. బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్లకు అబద్ధాలు చెప్పటం వెన్నతో పెట్టిన విద్య. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తున్నారు. నేను నిజమైన హిందువుగా అమ్మవారి వద్ద సవాల్ చేశాను.' అని పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు.
బండి సంజయ్ ఇక్కడికి రాకపోవటంతో నిజమైన హిందువు కాదని అర్థం అయిందని పైలట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) అన్నారు. రఘునందన్ పఠాన్ చెరులో పరిశ్రమల నుంచి వసూళ్లు చేయలేదా అని ప్రశ్నించారు. వందల కోట్లకు ఎలా ఎదిగావని అడిగారు. స్టార్ హోటళ్లలో సంవత్సరం పొడవునా రూమ్స్ పెట్టుకొనే స్థాయికి ఎలా వచ్చావన్నారు.
న్యాయం చేయాలని ఒక మహిళా మీ వద్దకు వస్తే ఏం చేశారో తెలుసు అని రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసు(Drugs Case)లో కొంతమంది నటీనటులకు మీరు వకాల్తా పుచ్చు కోలేదా అన్నారు. ఒకప్పుడు స్ట్రింగర్ గా ఉన్న రఘునందర్ ఇప్పుడు వందల కోట్లకు ఎలా ఎదిగాడని రోహిత్ రెడ్డి అడిగారు. కోట్లా విలువ చేసే విల్లాలో ఉంటూ.. ఖరీదైన కార్లలో ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు.
'నా సవాల్ ను బండి సంజయ్(Bandi Sanjay) స్వీకరించకుండా కొట్టి పారేశారు. ఆయన ఆరోపణలు అబద్ధమని తెలంగాణ(Telangana) ప్రజలకు అర్థమైంది. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య.' అని రోహిత్ రెడ్డి విమర్శించారు.