Nandhikanti Sridhar : తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్, పార్టీకి నందికంటి శ్రీధర్ రాజీనామా!
Nandhikanti Sridhar : మేడ్చల్-మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు.
Nandhikanti Sridhar : కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. మౌలాలి క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది పైగా ముఖ్య కార్యకర్తలతో నందికంటి రహస్య భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని తల్లిలా భావించా, కానీ ఆ తల్లే నన్ను మోసం చేసిందని కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని 35 సంవత్సరాలుగా పనిచేశానన్నారు. కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరగదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఉదయపూర్ డిక్లరేషన్ లో ఒక్క ఇంటికి ఒక్కటే టికెట్ ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మైనంపల్లి హనుమంత్ రావుకు మల్కాజగిరి సీట్, అయినా కొడుకుకి మెదక్ సీటు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
"నా రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికే టికెట్ ఇస్తారా? 1994 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా గుర్తింపు లేదు. ఈసారి టికెట్ల కేటాయింపు వ్యవహారంలో బీసీలకు ప్రాధాన్యత దక్కడం లేదు. గత ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి లేదా పోటీ చేసిన బీసీ కమ్యూనిటీ నాయకులకు అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. మల్కాజ్ గిరి, మెదక్ నియోజకవర్గాల సీట్లను ఒకే కుటుంబానికి ఎలా కేటాయిస్తున్నారు. బీసీ నాయకులను కాదని మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ కి రెండు సీట్లు కేటాయించడం అన్యాయం. వీళ్లు ఇద్దరూ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి, పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన మైనంపల్లికి టికెట్ కేటాయించాలని చూడడం దుర్మార్గం. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని కాదని కాంగ్రెస్ పార్టీ ఒక అగ్రకుల కుటుంబానికి సీటు కేటాయించాలని చూస్తుంది. పార్టీ మారిన ఈ ఇద్దరు వ్యక్తులకు సీట్లు ఇవ్వడం అన్యాయం. దీంతో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సీట్లు దక్కవని తేలిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను."- నందికంటి శ్రీధర్
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నందికంటి రాజీనామా లేఖను పంపించారు. శ్రీధర్ గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ నేత పార్టీకి ఆయన సేవలందించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపునకు కృషి చేశారు. ఇటీవల శ్రీధర్ ను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లారు. అయినా శ్రీధర్ శాంతించలేదు. మైనంపల్లికి, ఆయన కుమారుడికి సీట్లు కేటాయించడంపై శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని శ్రీధర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.