Medaram Jatara : నెలాఖరులోగా మేడారం పనులు పూర్తి, నాణ్యత లేని పనులుచేస్తే సీరియస్ యాక్షన్- మంత్రులు-medaram news in telugu minister seethakka konda surekha reviews on medaram maha jatara 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara : నెలాఖరులోగా మేడారం పనులు పూర్తి, నాణ్యత లేని పనులుచేస్తే సీరియస్ యాక్షన్- మంత్రులు

Medaram Jatara : నెలాఖరులోగా మేడారం పనులు పూర్తి, నాణ్యత లేని పనులుచేస్తే సీరియస్ యాక్షన్- మంత్రులు

HT Telugu Desk HT Telugu
Jan 17, 2024 10:19 PM IST

Medaram Jatara : మేడారం జాతరకు ఈ నెలాఖరులోపు అన్ని ఏర్పాట్లు చేస్తున్న చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు సీతక్క, కొండా సురేఖ తెలిపారు. జాతరకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

 మేడారం జాతర ఏర్పాట్లు
మేడారం జాతర ఏర్పాట్లు

Medaram Jatara : మేడారం మహాజాతర పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్పష్టం చేశారు. జాతరను విజయవంతం చేసేందుకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వం ఇదివరకు కేటాయించిన రూ.75 కోట్లతో పాటు మరో రూ.30 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పనులపై బుధవారం మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో రివ్యూ చేశారు. ముందుగా ఇద్దరు మంత్రులు ములుగు గట్టమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గట్టమ్మ తల్లి వద్ద ఏర్పాట్లను పరిశీలించి పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మేడారం చేరుకోగా.. అక్కడి సమ్మక్క సారలమ్మ పూజారులు మంత్రులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

yearly horoscope entry point

కావాల్సిన నిధులు సమకూరుస్తాం: సీతక్క

గత సంవత్సరం వరదలతో మేడారం చిన్నాభిన్నమైందని, సరిగ్గా మేడారం జాతరకు 60 రోజుల ముందు మాత్రమే తమ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అయినా ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జాతరకు రూ.200 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ పాలకులు మాట తప్పారని విమర్శించారు. కానీ ఈసారి జాతర ఏర్పాట్లు కోసం కావాల్సిన నిధులు సమకూర్చడానికి సిద్దంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తుందని, జాతర పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. జాతర పనులు, నిర్వహణలో రాజీపడేది లేదని, ఇద్దరం మహిళా మంత్రులం సమ్మక్క సారలమ్మను ఇలవేల్పుగా కొలుస్తామన్నారు. ఈ మహాజాతరకు అధికారులు సమన్వయంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఈ విషయంలో తగిన చొరవ చూపాలన్నారు. ఏటా జాతరకు నిధులిచ్చే కేంద్రం ఈసారి కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి జాతరను సక్సెస్​ చేసేందుకు సహకరించాలని కోరారు.

రాజీ పడే ప్రసక్తే లేదు: కొండా సురేఖ

మేడారం పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అడగగానే నిధులు ఇస్తున్నారని, పనుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకు వంద శాతం పనులు పూర్తి కావాలని, కాంట్రాక్టర్లు, అధికారులు రాజీపడకుండా పని చేయాలన్నారు. నాణ్యత లేని పనులు చేస్తే విచారణ జరిపి సీరియస్​ యాక్షన్​ తీసుకుంటామని హెచ్చరించారు. జాతర ఏర్పాట్లలో శాశ్వత నిర్మాణాలు చేస్తున్నామని, ఇద్దరు తల్లుల జాతరకు, ఇద్దరం మహిళా మంత్రులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అయినా ప్రతిపక్షాలు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే కచ్చితంగా స్వీకరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని, అధికారులు అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner