Rekha Naik : నా జీవితం ఖానాపూర్ ప్రజలకే అంకితం, కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే రేఖానాయక్
Rekha Naik : బీఆర్ఎస్ తొలి జాబితాలో ప్లేస్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కంటతడిపెట్టుకున్నారు. నమ్మించి మోసం చేశారని ఆవేదన చెందారు.
Rekha Naik : నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ బోరున విలపించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తనకు సీటు కేటాయించపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. ఆమెను కలిసేందుకు వచ్చిన అనుచరులతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేఖా నాయక్ కాంగ్రెస్ బాట పట్టారు. రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమయంలో శ్యామ్ నాయక్‌కు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారు. ఆమె కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్‌ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను తప్పించి జాన్సన్ నాయక్ పేరును ప్రకటించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన జాన్సన్ నాయక్ మంత్రి కేటీఆర్ క్లాస్ మేట్. హైదరాబాద్ నిజాం కళాశాలలో వీరద్దరూ కలిసి చదువుకున్నారు.
నా తడాఖా చూపిస్తా
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గాంధీభవన్‌లో రేఖా నాయక్ పీఏ ఎమ్మెల్యే టికెట్ కు దరఖాస్తు అందజేశారు. ఖానాపూర్‌లో రేఖానాయక్ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. నియోజకవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని ఆమె చెప్పారు. తన జీవితం ఖానాపూర్ ప్రజలకే అంకితమని, ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనను ఎవరు మోసం చేసినా భగవంతుడు మోసం చేయడనే నమ్మకం తనకుందని రేఖా నాయక్ చెప్పారు. ఖానాపూర్ నుంచి తాను పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనను మోసం చేసిందని కంటతడి పెట్టుకున్నారు. జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదన్నారు. అతడిని ఈ ఎన్నికల్లో గెలవనీయనని ఛాలెంజ్ చేశారు. ఈసారి కూడా నియోజవర్గ ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని రేఖా నాయక్ తెలిపారు.
జాన్సన్ నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్
బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు అంటున్నారు. ఖానాపూర్ పై రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుంచి ఆమె భర్త శ్యామ్ నాయక్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అవకాశం ఇస్తే రెండు చోట్లా పోటీ చేస్తామంటున్నారు. రెండింట్లో ఒక టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇటీవల రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చారని తెలుస్తోంది. అసలు ఎస్టీ కాని జాన్సన్ నాయక్‌కు టికెట్ ఎలా ఇచ్చారని రేఖా నాయక్ ప్రశ్నిస్తున్నారు. జాన్సన్ నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఎస్టీ ఎలా అవుతాడని నిలదీశారు. బీఆర్ఎస్ కు ఖానాపూర్‌లో తన సత్తా ఏంటో చూపిస్తానని రేఖా నాయక్ అన్నారు.