KCR Comments : మళ్లీ అధికారంలోకి వస్తే 15 ఏళ్లు మనమే ఉంటాం - కేసీఆర్-kcr said that if we wins the next election the brs party will be in power for 15 years ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Comments : మళ్లీ అధికారంలోకి వస్తే 15 ఏళ్లు మనమే ఉంటాం - కేసీఆర్

KCR Comments : మళ్లీ అధికారంలోకి వస్తే 15 ఏళ్లు మనమే ఉంటాం - కేసీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 03, 2024 09:28 AM IST

KCR Comments : త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. మరోసారి అధికారంలోకి వస్తే 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ఆ పార్టీ అధినేత  కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని వ్యాఖ్యానించారు.

గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్ళీ అలాగే జరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్…. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని, అలా కాకుండా కొందరు కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారని అన్నారు. కేసీఆర్‌ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దానిని కూడా చెరిపేస్తరా? అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లు అందరూ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కేసీఆర్ ప్రశంసించారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని తెలిపారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులు తలెత్తాయని కేసీఆర్ విమర్శించారు. ఇవే కాకుండా  శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు చెలరేగడం బాధ కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారని, మరి శాంతిభద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలని కోరారు. 

 మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తామని కేసీఆర్ చెప్పారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.  తాము అధికారంలోకి వచ్చాక గతంలో వైఎస్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను పేర్లు మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని గుర్తు చేశారు.

రెండేండ్లలో నియోజకవర్గాల పునర్విభజన…

మరో రెండేండ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. అప్పుడు మహిళలకు కూడా ఎకువ అవకాశాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందన్న ఆయన… ఈసారి బీఆర్‌ఎస్‌ తరఫున ఎవరికి బీఫాం దకితే వాళ్లదే విజయమని పేర్కొన్నారు.

 స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. పార్టీ అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని  స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామని చెప్పారు..

 

 

WhatsApp channel