TG High Court on KCR: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విచారణపై కేసీఆర్ పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
TG High Court on KCR: తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై స్టే విధించాలని కోరుతూ మాజీ సిఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు మార్గం సుగమం అయ్యింది.
TG High Court on KCR: తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూడిషియల్ కమిషన్‌పై స్టే విధించాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. గతంలో తెలంగాణ శాసన సభలో శ్వేత పత్రాల విడుదల సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్‌ఎస్ హయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అవసరమైతే విచారణ చేసుకోవచ్చని సవాలు చేశారు. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రేవంత్ రెడ్డి జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఆ తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇప్పటికే బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపై పలువురిని విచారించింది. ఈ క్రమంలో గత వారం కేసీఆర్‌ను కూడా విచారణకు హాజరు కావాలని కమిషన్ సూచించింది.
ఈ క్రమంలో విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటైన కమిషన్‌ను రద్దు చేయాలని KCR పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు జరిపిన విచారణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందు ఉంచింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై ప్రాథమిక సమాచారాన్ని అందించింది. విచారణకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
నోటీసులు ఇచ్చినా స్పందించని కేసీఆర్.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటైన జ్యూడిషియల్ కమిషన్ జూన్ 11న నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్ 15 లోపు విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు. అయితే తనకు జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ ను కోరారు.
ఛత్తీస్ గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు
జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (PPA) తన ప్రమేయంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ కోరింది. దీనిపై స్పందించిన కేసీఆర్ జులై 30 వరకు తనకు అదనపు సమయం కావాలని కోరుతూ లేఖ రాశారు.
యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిషన్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనపై కూడా విచారణ జరుగుతోంది.
మరోవైపు తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకరరావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరయ్యారు. సురేశ్ చందా ఇంధన శాఖలో పనిచేసిన సమయంలో, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాలనే వివాదాస్పద ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.
నోటీసులపై కేసీఆర్ స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ హెచ్చరించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పీపీఏలో జరిగిన అవకతవకలను వెలికితీయాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ విచారణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో పాలుపంచుకున్న ఇతర అధికారులకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కమిషన్‌కు లేఖ రాసిన కేసీఆర్….
ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూన్ 15న లేఖ రాశారు. 12 పేజీలతో కూడిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
విద్యుత్ నియంత్రణ కమిషన్‌లు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించటం విచారకమన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి... అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే జూన్ 11వ తేదీన మీడియా సమావేశంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
కమిషన్ వ్వవహరిస్తున్న తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ఘంగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని… ఎంక్వైరీ బాధ్యతల నుంచి స్వచ్ఛదంగా తప్పుకోవాలని కోరుతున్నట్లు లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు.
విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా కమిషన్ మాటలున్నాయని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదని…. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోందని రాసుకొచ్చారు. లేఖలో పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైయిరీ కమిషన్ బాధ్యత నుంచి వైదొలగలని కేసీఆర్ కోరారు. ఆ తర్వాత కమిషన్ విచారణపై స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.
సంబంధిత కథనం