KCR Driving : ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్ - కారణం ఇదే…!
KCR Driving Video : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఓమ్నీ వ్యాన్ నడిపారు. డాక్టర్ల సూచనల మేరకు డ్రైవింగ్ చేసినట్లు తెలిసింది. ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
KCR Driving Video : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. డాక్టర్ల సూచన మేరకు తన ఫామ్ హౌస్ లో డ్రైవింగ్ చేశారు. కాలు ఆపరేషన్ తరువాత ప్రస్తుతం కర్ర సహాయం లేకుండానే కేసీఆర్ నడుస్తున్నారు. మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు ఇచ్చిన సూచనల మేరకు తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు ఇప్పటివా..? లేక కొద్దిరోజుల కిందటివా అనేది తెలియాల్సి ఉంది…!
గతేడాది డిసెంబర్ 8వ తేదీన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
కొద్దిరోజులు అపోలో ఆస్పత్రిలోనే కేసీఆర్ చికిత్స పొందారు. అక్కడ్నుంచి హైదరాబాద్ లోని నందినగర్ లోని తన నివాసానికి షిఫ్ట్ అయ్యారు. ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందిన సమయంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శించి… ఆరోగ్యంపై ఆరా తీశారు.
ఆ తర్వాత ఫామ్ హౌస్ లోనే గడపుతున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా క్యాంపెయినింగ్ కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి పూర్తిస్థాయిలో ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా ఫామ్ హౌస్ కు వెళ్తున్న పలువురు నేతలు కేసీఆర్ ను కలుస్తున్నారు. మరోవైపు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న నేపథ్యంలో కేసీఆర్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రెండు రోజులుగా పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు…. కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్… కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
టాపిక్