Karimnagar News : అవతరణ వేడుకల్లో అపశృతి- ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు-karimnagar rtc express scooty mat accident zph school headmaster died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar News : అవతరణ వేడుకల్లో అపశృతి- ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు

Karimnagar News : అవతరణ వేడుకల్లో అపశృతి- ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు

HT Telugu Desk HT Telugu
Jun 02, 2024 09:08 PM IST

Karimnagar News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తున్న ప్రధానోపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో అపశృతి- ప్రాణాలు కోల్పోయిన ప్రాధానోపాధ్యాయురాలు
రాష్ట్ర అవతరణ వేడుకల్లో అపశృతి- ప్రాణాలు కోల్పోయిన ప్రాధానోపాధ్యాయురాలు

Karimnagar News : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి తిరుగు ప్రయాణమైన ప్రధానోపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసి బస్సు త్రీవీలర్ స్క్రూటినీ ఢీ కొట్టడంతో వేములవాడ మండలం శాత్రాజ్ పల్లి జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు టి.సత్తవ్వ మృతి చెందారు. ఈ సంఘటన కొత్తపల్లి మండలం వెలిచాల ఎక్స్ రోడ్డు వద్ద జరిగింది.

రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన దివ్యాంగురాలు టి.సత్తవ్వ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాత్రాజ్ పల్లి జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు. తోటి టీచర్లతో ఉత్సాహంగా గడిపిన సత్తవ్వ ఇంటికి బయలుదేరారు. వెలిచాల ఎక్స్ రోడ్ చేరుకునే సరికి మృత్యుశకటంలా దూసుకొచ్చిన నిజామాబాద్ డిపో ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు ఆమె వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సత్తవ్వ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.‌ ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరే అవకాశం ఉండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఉత్సవాలపై కోడ్ ఎఫెక్ట్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ఎన్నికల కోడ్ ప్రభావం చూపింది. పండుగలా నిర్వహించాలనుకున్న దశాబ్ది ఉత్సవాలను పలుచోట్ల మొక్కుబడిగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 2న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించగా ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ ప్రభావంతో కలెక్టరేట్ లకే వేడుకలు పరిమితం అయ్యాయి. అధికారులు ఉద్యోగులు తప్ప ఎవ్వరు వేడుకల్లో పాల్గొనలేదు. మొక్కుబడిగా అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.

కలెక్టర్ల ఆధ్వర్యంలో వేడుకలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లకే పరిమితమైన వేడుకలను కలెక్టర్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి, అమరవీరుల స్మారక స్థూపానికి జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జాతీయ పతాకాలను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, జగిత్యాలలో కలెక్టర్ యాస్మిన్ భాషా, సిరిసిల్ల కలెక్టరేట్ లో అనురాగ్ జయంతి జాతీయపతాలను ఎగురవేసి పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ రాబోయే రోజుల్లో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

Whats_app_banner

సంబంధిత కథనం