TG Formation Day 2024 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పూర్తి షెడ్యూల్ ఇదే!
TG Formation Day 2024 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఇలా ఉంది.
TG Formation Day 2024 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి అవతరణ దినోత్సవం కావడంతో ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ దశాబ్ది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఇటీవలే ఆహ్వానించగా....అనారోగ్యం, ఎండల తీవ్రత దృష్ట్యా సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్టే కనిపిస్తుంది. ఈ మేరకు గాంధీ భవన్ వర్గాలు సోనియా గాంధీ హాజరు కావడం దాదాపు కష్టమే అని చెబుతున్నాయి. సోనియా గాంధీ తెలంగాణ పర్యటనకు రానప్పటికీ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు సందేశం పంపనున్నట్టు సమాచారం. ఆ సందేశాన్ని రేపు పరేడ్ గ్రౌండ్ లో భారీ తెరలపై ప్రదర్శించనున్నారు. తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సోనియా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆమె వీడియో రూపంలో ప్రజలకు సందేశాన్ని పంపుతారు.
రేపటి పూర్తి షెడ్యూల్ ఇదే
ఇదిలా ఉంటే రేపు జరిగే వేడుకల కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబు అవుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 20 నుంచి 25 వేల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని అక్కడ జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తారు. తదనంతరం శిక్షణ పోలీస్ బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్ తో పాటు పోలీస్ గౌరవ వందనం ఉంటుంది. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం తరువాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ప్రసంగం తరువాత పోలీస్ సిబ్బందికి, ఉత్తమ అధికారులకు అవార్డులు అందిస్తారు. వీరితో ఫొటో సెషన్ తరువాత ఉద్యమకారుల కుటుంబాలకు సన్మానం చేయనున్నారు. దాంతో పరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమం ముగుస్తుంది. ఇక సాయంత్రానికి ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
5 వేల మందితో ఫ్లాగ్ వాక్
ఈ కార్యక్రమానికి సాయంత్రం ఆరున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు, అధికారులు హాజరవుతారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ సంస్కతి,సంప్రదాయాలు అద్దం పట్టేలా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, ఫుడ్ స్టాళ్లు, రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అనంతరం 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు హాజరు కానున్నారు. దీని తరువాత ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టేజ్ పై నిమిషం పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. అనంతరం ట్యాంక్ బండ్ పై 5 వేల మంది జాతీయ పథకంతో భారీ ఫ్లాగ్ వాక్ చేయనున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధికారిక గేయం జయజయహే తెలంగాణ పాటను ప్రదర్శిస్తారు. అనంతరం ఈ పాటలో భాగం పంచుకున్న అందె శ్రీ, కీరవాణి సన్మానం చేస్తారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం