Sonia Gandhi Telangana Tour : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ దూరం..? కారణం ఇదే-according to congress party circles sonia gandhi visit to telangana has been cancelled ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sonia Gandhi Telangana Tour : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ దూరం..? కారణం ఇదే

Sonia Gandhi Telangana Tour : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ దూరం..? కారణం ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 01, 2024 01:09 PM IST

Sonia Gandhi Telangana Tour : కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ టూర్ రద్దు అయినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరుకాకపోవచ్చు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

సోనియాగాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)
సోనియాగాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)

Sonia Gandhi Telangana Tour : సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోనియా గాంధీ రాష్ట్రానికి వస్తారని అంతా భావించారు. అయితే అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ తెలంగాణ పర్యటనకు రాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా దశాబ్ధి ఉత్సవాల్లో సోనియా గాంధీ పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గవర్నర్ కు ఆహ్వానం….

జూన్ 2న తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రముఖలతో పాటు ఉద్యమకారులను కూడా ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర గవర్నర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. రాజ్ భవన్ లో కలిసి రేపు జరిగే ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.

జూన్ 2న కార్యక్రమాలివే :

  • జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు.
  • ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది.
  • తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
  • పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.
  • జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు.
  • సాయంత్రం 6.30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు.
  • తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.
  • అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
  • స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్​పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్​ వాక్​ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్​ వాక్​ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్​ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. ఇదే వేదికపై తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు.
  • రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్ వర్క్స్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.

’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. దశాబ్ధి వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు.

Whats_app_banner