Jaggareddy: అలిగిన జగ్గారెడ్డి.. సంగారెడ్డి నుంచి పోటీ చేయనని ప్రకటన
Jaggareddy: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న జగ్గారెడ్డి సంగారెడ్డిలో మళ్లీ పోటీ చేయనని చెబుతున్నారు. జగ్గారెడ్డి తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Jaggareddy: సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి ప్రవర్తన… పార్టీ కార్యకర్తలను, సంగారెడ్డి ప్రజలను విస్తుపోయాలా చేస్తోంది.
ఓటమికి కారణాలేంటో, తాను చేసిన తప్పులేంటో తెలుసుకోకుండా, సంగారెడ్డి ప్రజలను, ఓటర్లను తన ఓటమికి బాద్యులను చేస్తూ మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాను ప్రజలకు అందుబాటులో ఉండనని నన్ను ఓడించారని, మళ్లీ సంగారెడ్డి నుండి ఎన్నికల్లో పోటీచేయనని జగ్గా రెడ్డి ప్రకటించడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించింది.
తప్పులను సరి చేసుకోకుండా, ప్రజల మీద అలుగుడు ఏమిటోనని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. సంగారెడ్డికి పూర్తిగా రాకపోవటంతో పాటు ప్రజలకు దూరంగా ఉండటంతో జగ్గారెడ్డి అన్నంత పని చేశాడని భావిస్తున్నారు. అయితే అదిఎవరికీ నష్టం కలిగిస్తోందో రాజకీయాల్లో ఆరితేరిన జగ్గారెడ్డికి తెలియదా అని జిల్లా నేతలు ప్రశ్నిస్తున్నారు.
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పోస్టర్లలో కూడా జగ్గారెడ్డి ఫోటో కూడా మాయమైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా జగ్గారెడ్డి భార్య ఉన్నా, జగ్గారెడ్డి ఫోటో పెట్టొద్దని ఆమె సూచించినట్టు తెలుస్తుంది.
జగ్గారెడ్డి భార్య నిర్మల, కూతురు జయా రెడ్డి, భరత్ సాయి రెడ్డి మాత్రం తరచుగా నియోజకవర్గంలో ప్రజలను కలుస్తున్నారు. జగ్గా రెడ్డి ప్రజల మీద అలగటం, చెరువు మీద అలిగినట్టు ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రజల మీద అలిగితే ఎవరికి నష్టమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
గత ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పదికి తొమ్మిది సీట్లు కోల్పోయింది. ఆ సమయంలో సంగారెడ్డి నుండి గెలియిర జగ్గా రెడ్డి పార్టీలో తన ప్రాబల్యాన్ని ఐదు సంవత్సరాలలో మరింతగా పెంచుకున్నాడు. ఈ సారి గెలవటం, మంత్రి పదవి చేపట్టడం ఖాయమని భావించినా చివరకు ఓటమి పాలవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
మంత్రి పదవి దక్కాల్సిన సమయంలో ఓటమి పాలయ్యాననే నైరాశ్యంలోనే అర్ధం పర్ధం లేని వ్యాఖలు చేస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, జగ్గా రెడ్డి పూర్తిగా నియోజకవర్గానికి దూరం అవ్వటమే తన కొంపముంచిందని సంగారెడ్డి ఓటర్లు అంటున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండడని, కష్టం వస్తే ఆదుకోడనే ఉద్దేశంతోనే ప్రజలు ఓడించారంటున్నారు. సంగారెడ్డి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిసిన జగ్గా రెడ్డి, రాజకీయ భవితవ్యం ఏమిటో తనకే అర్ధం కానీ పరిస్థితిలోకి వెళ్లాడని కార్యకర్తలు వాపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో తీవ్ర విబేధాలుండటం కూడా నైరాశ్యానికి కారణమని చెబుతున్నారు.