Republic Day Invitation: తెలంగాణ రైతులకు ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం-invitation to telangana farmers for republic day celebrations in delhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Republic Day Invitation: తెలంగాణ రైతులకు ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం

Republic Day Invitation: తెలంగాణ రైతులకు ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం

HT Telugu Desk HT Telugu
Jan 25, 2024 09:55 AM IST

Republic Day Invitation: తెలంగాణ కు చెందిన ఐదుగురి రైతులకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం లభించింది.

రిపబ్లిక్ డే ఆహ్వానం లభించిన సంగారెడ్డి రైతులు
రిపబ్లిక్ డే ఆహ్వానం లభించిన సంగారెడ్డి రైతులు

Republic Day Invitation: తెలంగాణలో పండ్ల తోటలు, కూరగాయలు పండిస్తున్న ఐదుగురి రైతులకు 75వ రిపబ్లిక్ డే సంబరాలలో పాల్గొనే అరుదయిన గౌరవం లభించింది.

వివిధ పంటలు పండించడంలో పేరుపొందిన ఈ ఐదుగురి రైతులను స్వయంగా కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సంబరాలలో పాల్గొనడానికి ఆహ్వానించింది. రైతులతో పాటు వారి భార్యలకు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసి మరీ రిపబ్లిక్ డే సంబరాలలో పాల్గొనాలని కోరింది.

వీరితోపాటు వనపర్తి జిల్లాకు చెందిన హార్టికల్చర్ అధికారి శ్రీకాంత్‌ని కూడా ప్రభుత్వం డిల్లీకి ఆహ్వానించింది.

కూరగాయల రైతు హనీఫ్....

సంగారెడ్డి జిల్లాకు చెందిన, మొహమ్మద్ హనీఫ్ అనే రైతు, గుమ్మడిదల మండలంలోని మంబాపూర్లో 20 ఎకరాలలో కూరగాయలు పండిస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ఒకే సంవత్సరం కోటి రూపాయలకు పైగా సంపాదించిన ఘనత హనీఫ్ సొంతం.

హనీఫ్‌ వ్యవసాయం చేసే తీరు చూసిన అప్పటి సంగారెడ్డి కలెక్టర్ హనుమంత రావు, దళితబంధు లబ్దిదారులకు ఎలా లాభసాటి వ్యవసాయం చేయాలో నేర్పించాలని కోరారు. జిల్లా మొత్తం మీద కూరగాయల పండించడంలో ఎందరికో మార్గదర్శిగా నిలిచాడు హనీఫ్. హనీఫ్ తో పాటు, తన భార్య అలియా బేగం కూడా ఇప్పటికే గణతంత్ర సంబరాలలో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరారు.

28 రకాల మామిడి పండ్లు పండిస్తున్న శ్రీరామ్....

జహీరాబాద్ మండలంలోని బుర్ధిపాడ్ గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో 28 రకాల మామిడి పండ్లు పండిస్తున్న బవగి శ్రీరామ్ కు కూడా గణతంత్ర సంబరాలలో పాల్గొనడానికి అవకాశం లభించింది.

తెలంగాణ మొత్తం మీద ఐదుగురు రైతులకు ఆహ్వానం వస్తే, అందులో ఇద్దరు రైతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావటం గమనార్హం. జహీరాబాద్ పట్టణంలో చిన్న వ్యాపారం చేస్తూ తన జీవితాన్ని ప్రారంభించిన శ్రీరామ్‌‌కు, వ్యవసాయం అంటే చిన్నప్పటి నుండి కూడా మక్కువ.

వ్యాపారంలో తనకు వచ్చిన డబ్బులు మిగిలిస్తూ, జహీరాబాద్ దగ్గర్లోని బుర్ధిపాడ్ గ్రామంలో 20 సంవత్సరాలలోనే 50 ఎకరాల భూమి కొన్నాడు. తనకున్న భూమిలో, 32 ఎకరాలలో 28 రకాల మామిడి పండ్లు పండిస్తున్నాడు.

ఇందులో ప్రఖ్యాతి చెందిన బంగినపల్లి, హిమాయత్, పెద్ద రసాలు, చిన్న రసాలు, పచ్చడ రకం, అల్ఫాన్సో తో పాటు మరెన్నో రకాల మామిడి పంటలను పండిస్తున్నాడు. రాష్ట్రంలోని చాలామంది విఐపిలు ప్రతి సంవత్సరం తన తోట నుండి పండ్లను తీసుకెళ్తుంటారు.

విఐపిలకు మక్కువ మామిడి పండ్లు...

చివరి మామిడి పండ్ల సీజన్లో లో, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ 100 డబ్బాల మామిడి పండ్లు తన తోట నుండి కొనుగోలు చేసి రాజభవన్ లో పనిచేసే వారందరికీ బహుమంతిగా ఇచ్చారు.

శ్రీరామ్ ప్రతి సంవత్సరం తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీస్ కు, సంగారెడ్డి కలెక్టర్ వంటి విఐపిలకు తన తోటలో కాచిన రుచికరమైన మామిడి పండ్లు పంపిస్తుంటారు. భార్య అంబికా తో కలిసి శ్రీరామ్, న్యూ ఢిల్లీ గణతంత్ర సంబరాలకు ఇప్పటికే బయలుదేరారు.

హనీఫ్, శ్రీరామ్ తో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పెనుబల్లి గంగరాజు, వనపర్తి జిల్లాకు చెందిన విట్ట సూర్యచంద్ర రెడ్డి, ఎమ్ కృష్ణయ్య అనే ముగ్గురు రైతులకు కూడా ఈ అరుదైన గౌరవం లభించింది.

Whats_app_banner