TS Weather: అల్పపీడనం ఎఫెక్ట్... ఇవాళ, రేపు వర్షాలు - ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు-imd issues rain alert to telangana check full details are here ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Imd Issues Rain Alert To Telangana Check Full Details Are Here

TS Weather: అల్పపీడనం ఎఫెక్ట్... ఇవాళ, రేపు వర్షాలు - ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 02, 2023 09:16 AM IST

Rains in Telugu States: తెలంగాణకు మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతారవణ కేంద్రం. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది.

వర్ష సూచన
వర్ష సూచన (Twitter)

Weather Updates: గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే చాలా గ్రామాలు, పల్లెలు తేరుకుంటున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా వరదల దాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే...మరోసారి తెలంగాణకు వర్షసూచన వాతావరణశాఖ. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్‌ తీరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు కేంద్ర వాతావరణశాఖ ప్రకటించింది. ఫలితంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

ట్రెండింగ్ వార్తలు

అల్పపీడనం ప్రభావంతో... రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆగస్టు 5వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

కేంద్ర బృందం పర్యటన…

మంగళవారం ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటించింది. వరద నష్టాలు, సహాయక చర్యలను అంచనా వేయడంతో పాటు కేంద్ర సహాయాన్ని ఆమోదించడానికి తుది సిఫారసు చేయడానికి జిల్లాలో పర్యటిస్తుంది. వరదల వల్ల కలిగిన నష్టాన్ని హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ కమిషనర్ కేంద్ర బృందానికి వివరించారు. ఎన్డీఎంఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యార్థి (టీం లీడర్, డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూను స్వామి, హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వరంగల్, హనుమకొండలో పర్యటించారు. మంగళవారం కేంద్ర బృందం హైదరాబాద్ నుంచి నేరుగా హన్మకొండ కలెక్టరేట్ కు చేరుకుని హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు వాటిల్లిన నష్టంపై ఏర్పాటు చేసిన వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాలు వివరించారు.

కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో భారీ వర్షాల వల్ల సుమారు 450 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు వివరించారు. హనుమకొండ జిల్లాలో 58 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. ఈ భారీ వర్షాల వల్ల మొత్తం 14 మండలాలు ప్రభావితం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వర్షాలకు 6 గురు చనిపోయారన్నారు. 26 జంతువులు మృత్యువాత పడ్డాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 41 చెరువులు దెబ్బతిన్నాయని, 22 ఆర్ అండ్ బి రోడ్లు 8.30 కి.మీ పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 3 వేల 65 మీటర్ల మేర రోడ్డు కోతకు గురియ్యిందన్నారు. వీటి నష్టం రూ.40 కోట్ల 32 లక్షలుగా ఉందని అన్నారు. పి.ఆర్ 61 రోడ్లు 138.78 కి.మీ దెబ్బతిన్నాయని వీటి అంచనా నష్టం 59 కోట్ల 31 లక్షలు అంచనా వేశామన్నారు.

వరంగల్ నగరంలో వరదల వల్ల 150.61 కిలోమీటర్ల సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, 82.73 కిలోమీటర్ల బీటీ రోడ్లకు రూ. 92.94 కోట్ల నష్టం వాటిల్లినదని వరంగల్ మున్సిపల్ కమిషనర్ కేంద్ర బృందానికి తెలిపారు. 84.56 కిలోమీటర్ల రూ.43.55 కోట్ల మెటల్ రోడ్లు, 71 కల్వర్టులకు 52.41 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, 41.3 కిలోమీటర్ల మంచినీటి సరఫరా పైప్ లైన్ లకు రూ.25 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కమిషనర్ వివరించారు.

WhatsApp channel