Central Team Visits Warangal : వరంగల్, హనుమకొండలో కేంద్ర బృందం పర్యటన, వరద నష్టంపై అంచనా!-central team inspects flood damage in warangal hanamkonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Central Team Visits Warangal : వరంగల్, హనుమకొండలో కేంద్ర బృందం పర్యటన, వరద నష్టంపై అంచనా!

Central Team Visits Warangal : వరంగల్, హనుమకొండలో కేంద్ర బృందం పర్యటన, వరద నష్టంపై అంచనా!

Bandaru Satyaprasad HT Telugu
Aug 01, 2023 10:18 PM IST

Central Team Visits Warangal : వరదల నష్టాన్ని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తుంది. ఈ జిల్లాల కలెక్టర్లు, అధికారులు కేంద్ర బృందానికి వరద నష్టాన్ని తెలియజేశారు.

వరదల ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
వరదల ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటిస్తోంది. వరద నష్టాలు, సహాయక చర్యలను అంచనా వేయడంతో పాటు కేంద్ర సహాయాన్ని ఆమోదించడానికి తుది సిఫారసు చేయడానికి జిల్లాలో పర్యటిస్తుంది. వరదల వల్ల కలిగిన నష్టాన్ని హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ కమిషనర్ కేంద్ర బృందానికి వివరించారు. ఎన్డీఎంఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యార్థి (టీం లీడర్, డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూను స్వామి, హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వరంగల్, హనుమకొండలో పర్యటించారు. మంగళవారం కేంద్ర బృందం హైదరాబాద్ నుంచి నేరుగా హన్మకొండ కలెక్టరేట్ కు చేరుకుని హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు వాటిల్లిన నష్టంపై ఏర్పాటు చేసిన వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాలు వివరించారు.

హనుమకొండ జిల్లాలో రూ.450 కోట్ల నష్టం

కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో భారీ వర్షాల వల్ల సుమారు 450 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు వివరించారు. హనుమకొండ జిల్లాలో 58 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. ఈ భారీ వర్షాల వల్ల మొత్తం 14 మండలాలు ప్రభావితం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వర్షాలకు 6 గురు చనిపోయారన్నారు. 26 జంతువులు మృత్యువాత పడ్డాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 41 చెరువులు దెబ్బతిన్నాయని, 22 ఆర్ అండ్ బి రోడ్లు 8.30 కి.మీ పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 3 వేల 65 మీటర్ల మేర రోడ్డు కోతకు గురియ్యిందన్నారు. వీటి నష్టం రూ.40 కోట్ల 32 లక్షలుగా ఉందని అన్నారు. పి.ఆర్ 61 రోడ్లు 138.78 కి.మీ దెబ్బతిన్నాయని వీటి అంచనా నష్టం 59 కోట్ల 31 లక్షలు అంచనా వేశామన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

వరంగల్ నగరంలో వరదల వల్ల 150.61 కిలోమీటర్ల సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, 82.73 కిలోమీటర్ల బీటీ రోడ్లకు రూ. 92.94 కోట్ల నష్టం వాటిల్లినదని వరంగల్ మున్సిపల్ కమిషనర్ కేంద్ర బృందానికి తెలిపారు. 84.56 కిలోమీటర్ల రూ.43.55 కోట్ల మెటల్ రోడ్లు, 71 కల్వర్టులకు 52.41 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, 41.3 కిలోమీటర్ల మంచినీటి సరఫరా పైప్ లైన్ లకు రూ.25 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కమిషనర్ వివరించారు.

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భారీ వర్షాల వరద బాధితులు 535 కంప్లైంట్స్ రాగా 5 రెస్పాన్స్ టీంల ద్వారా వారిని రక్షిత ప్రాంతాలకు చేర్చామన్నారు. నగరంలో 199 కాలనీలు పాక్షికంగా నీటి మునిగాయని, వాటిని క్లియర్ చేశామన్నారు. పడిపోయిన 32 వృక్షాలను తొలగించామన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ద్వారా 27 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 3500 వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి భోజన సదుపాయం కల్పించామన్నారు. అనంతరం కేంద్ర బృందం కలెక్టర్లు, కమిషనర్, అధికారులతో కలిసి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జవహర్ నగర్, పోతన నగర్ ప్రాంతంలో భద్రకాళి బండ్ చెరువుకు గండి పడిన ప్రాంతాన్ని, బొంది వాగు ప్రాంతాన్ని పరిశీలించారు.