Medaram Jatara 2024 : మేడారం జాతరకు వెళ్తున్నారా..? అయితే వీటిని కూడా చూసి రండి-if you are going to medaram sammakka sarakka maha jatara 2024 visit these places ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara 2024 : మేడారం జాతరకు వెళ్తున్నారా..? అయితే వీటిని కూడా చూసి రండి

Medaram Jatara 2024 : మేడారం జాతరకు వెళ్తున్నారా..? అయితే వీటిని కూడా చూసి రండి

HT Telugu Desk HT Telugu
Feb 17, 2024 09:43 AM IST

Medaram Maha Jatara 2024 Updates: మేడారం జాతరకు వెళ్తున్నారా…? అయితే సమ్మక్క - సారక్క గద్దెలనే కాకుండా మరికొన్ని ప్రాంతాలను కూడా చూడొచ్చు. ఆ వివరాలను ఇక్కడ చూడండి….

మేడారం మహా జాతర 2024
మేడారం మహా జాతర 2024

Medaram Sammakka Sarakka Maha Jatara 2024: తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర ఇలా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండగా.. లక్షలాది మంది భక్తులు నాలుగు రోజులపాటు అక్కడే ఉండి తల్లులను దర్శించుకుంటుంటారు. కాగా మేడారం వెళ్లే భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు, జాతర పరిసరాల్లో ఏర్పాటయ్యే దుకాణాలు తప్ప మిగతా వేటినీ పెద్దగా పట్టించుకోరు. అందుకే మేడారంలో జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలు ఉన్న విషయం కూడా చాలామందికి తెలీదు. ఇవే కాదు జాతరలో మూడు, నాలుగు రోజులు గడిపే భక్తులు కూడా సమ్మక్క, సారలమ్మ ఆలయాలను చూసి ఉండరు. మేడారం జాతర ప్రాంగణంలోనే ఉండే వీటిపై పెద్దగా ప్రచారం లేకపోవడం వల్లే భక్తులు జంపన్న, నాగులమ్మ గద్దెలు, సమ్మక్క, సారలమ్మ ఆలయాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవడం లేదు. ఒకవేళ అటుగా వెళ్లిన సమయంలో వాటిని గమనించినా అవేంటో తెలియక చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. మరి జంపన్న, నాగులమ్మ గద్దెలు ఎక్కడున్నాయో.. సమ్మక్క, సారలమ్మ ఆలయాలను ఎక్కడ నిర్మించారో తెలుసుకుందామా..

మేడారంలో సమ్మక్క గుడి..

మేడారం మహాజాతర ప్రాంగణంలోనే సమ్మక్క ఆలయం ఉంటుంది. సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి ఈ గుడి దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. జాతర ప్రారంభానికి ముందు గుడిమెలిగె, మండమెలిగె పూజా కార్యక్రమాలు ఈ అలయంలోనే జరుగుతుంటాయి. ఈ మందిరంలోనే నిర్వహిస్తారు. జాతరకు వచ్చే చాలామంది భక్తులకు ఇక్కడ సమ్మక్క గుడి ఉందనే విషయం తెలియదు. అందుకే కేవలం గద్దెలను మాత్రమే దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుంటారు.

కన్నెపల్లిలో సారలమ్మ గుడి

కాకతీయ రాజులతో తల్లి సమ్మక్కతో పాటు కూతురు సారలమ్మ కూడా వీరోచితంగా పోరాటం చేసిన విషయం తెలిసిందే. కాగా మేడారానికి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కన్నెపల్లిలో సారలమ్మ గుడి కూడా ఉంది. పూజారులు, గ్రామస్తులు సారలమ్మను ఇంటి ఆడబిడ్డగా భావిస్తుంటారు. కాగా సంతానం కోసం ఎంతో మంది మహిళలు ఇక్కడ వరం పడుతుంటారు. జాతర సమయంలో గుడి నుంచి అమ్మవారిని మేడారంలోని గద్దే పైకి తీసుకెళ్లే క్రమంలో తడి బట్టలతో వరం పట్టిన వారిపై నుంచి అమ్మవారు దాటుకుంటూ వెళ్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడికి ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన భక్తులు తరలి వచ్చి పూజలు చేస్తుంటారు.

వాగు వద్దే జంపన్న గద్దె

మేడారంలో సమ్మక్క కొడుకు అయిన జంపన్న వాగు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాగు పక్కనే ఉన్న జంపన్న గద్దె మాత్రం చాలామందికి తెలిసుండదు. జంపన్న వాగు వద్ద అవతలి పక్క స్నాన ఘట్టాలపైనే జంపన్న గద్దె ఉంటుంది. సమ్మక్క- సారలమ్మ గద్దెలు ఏర్పాటు చేసిన కాలంలోనే జంపన్న గద్దె కూడా ఏర్పాటు చేసినట్లు ఇక్కడి పూజారులు చెబుతున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసే భక్తుల్లో చాలామందికి అక్కడ జంపన్న గద్దె ఉందన్న విషయమే తెలీదు. ఈ విషయం తెలిసిన వారు మాత్రమే ఇక్కడికి వచ్చి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తుంటారు.

వాగు పక్కనే నాగులమ్మ గద్దె

సమ్మక్క తల్లికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. నాగులమ్మ కూడా కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందింది. కాగా సమ్మక్క, సారలమ్మతో పాటు నాగులమ్మ కు గద్దె ఏర్పాటు చేశారు. జంపన్న వాగు ఇవతలి వైపు ఉన్న స్నాన ఘట్టాల వద్ద ఈ నాగులమ్మ గద్దె ఉంది. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన భక్తులు నాగులమ్మకు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. జాతరకు వచ్చే భక్తుల్లో చాలామంది మహిళలు ఈ గద్దెను ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తుంటారు. జాతరకు వచ్చే భక్తులు అటుగా వెళ్తున్నా.. ఇది నాగులమ్మ గద్దె అని చాలామందికి తెలియడం లేదు.

మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ పూజా మందిరాలతో పాటు జంపన్న, నాగులమ్మ గద్దెలు ఉన్నట్టు భక్తులకు తెలియజేసే వ్యవస్థ లేదు. అందుకే చాలామందికి వాటి గురించి తెలియడం లేదు. జాతరలో నాలుగైదు రోజులు ఉండే భక్తులు కూడా వాటిని దర్శించుకోలేకపోతున్నారు. కాగా వాటికి సరైన గుర్తింపు తీసుకురావాల్సిన ప్రభుత్వం కనీసం అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదనే విమర్శలున్నాయి. ప్రైవేట్‌ వెహికిల్స్, ఆర్టీసీ బస్సుల్లో జాతరకు వచ్చే భక్తులకు పార్కింగ్ ప్లేసులతో పాటు ప్రయాణ మార్గాల్లో మేడారంలో దర్శించుకోతగ్గ ప్రదేశాల గురించి తెలిసేలా కనీసం బోర్డులైనా ఏర్పాటు చేస్తే ఎంతోమంది భక్తులు వాటిని దర్శించుకునే అవకాశం ఉంది.

(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం