Medaram Maha Jatara 2024 : మేడారం భక్తులకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి 'హెలికాప్టర్' సేవలు, ధరలివే
Medaram Maha Jatara 2024:మేడారం వెళ్లాలని అనుకునేవారి కోసం సరికొత్త సేవలను తీసుకువచ్చింది తెలంగాణ పర్యాటక శాఖ. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి హెలికాఫ్టర్ సేవలను అందుబాటులో తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం జాతర ట్రెండ్ మారింది. రవాణా సదుపాయం పెద్దగా అందుబాటులో లేని కాలంలో కాలినడక, ఎడ్ల బండ్ల మీద మాత్రమే భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చేవారు. ఆ తరువాత జాతర ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆర్టీసీ సేవలను ప్రారంభించగా.. ఇప్పుడు ఏకంగా హెలిక్యాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గత రెండు జాతరల నుంచి మేడారం జాతరకు హెలిక్యాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకురాగా.. ఈసారి కూడా ఆకాశ మార్గాన ప్రయాణం కోసం హెలిక్యాప్టర్ సేవలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలిప్యాడ్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు.
హనుమకొండ టు మేడారం
తెలంగాణ కుంభమేళా, వనదేవతల మహాజాతర మేడారం జాతరకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. జాతర పూర్తయ్యే వరకు రాష్ట్రంలోని దాదాపు 51 సెంటర్ల నుంచి 6 వేలకు పైగా బస్సులు నడిపించేందుకు రంగం సిద్ధం చేసింది. రెండ్రోజుల్లో మేడారం ప్రత్యేక బస్సులు స్టార్ట్ కానుండగా.. ఇప్పుడు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తోంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లేదా కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియేల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం గద్దెల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వరకు భక్తులను ఆకాశ మార్గాన తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తుననారు. 2020 మేడారం జాతర సందర్భంగా తొలిసారి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకురాగా.. 2022లో కూడా ఈ సేవలు కొనసాగాయి. కాగా ఈసారి హెలికాప్టర్ సేవలు ఉంటాయో ఉండవోననే సందేహాలు నెలకొనగా.. ఈ సారి కూడా ప్రభుత్వం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మైడారంలో జాయ్ రైడ్
గత రెండు పర్యాయాలు కూడా హనుమకొండ నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ ప్రయాణాన్ని ఔత్సాహికులకు అందుబాటులోకి తెచ్చారు. కాగా ఒక్కో ట్రిప్ లో ఐదుగురికి ప్రయాణించే అవకాశం ఉండగా.. ఒక్కొక్కరికి హనుమకొండ నుంచి మేడారం జాతరకు రూ.20 వేల వరకు టికెట్ ధర నిర్ణయించారు. ప్రయాణికులు రూ.20 వేలు చెల్లిస్తే వారిని మేడారం తీసుకెళ్లడం, అక్కడ వారికి తల్లుల ప్రత్యేక దర్శనం చేయించి, తిరిగి మళ్లీ హనుమకొండకు చేర్చేవారు. ఈసారి రేట్ల విషయంలో పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉండగా.. గతంలో మాదిరిగానే టికెట్ ధర రూ.20 వేలకు పైగానే ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు. అంతేగాకుండా హెలిక్యాప్టర్ మేడారం తీసుకెళ్లిన అనంతరం అక్కడ మేడారం ఏరియల్ వ్యూ చూసేందుకు కూడా అవకాశం ఇచ్చారు. గతేడాది మేడారం ఏరియల్ వ్యూ చూసిన వారిని టికెట్ ధర రూ.3700 నిర్ణయించగా.. ఈసారి ఏరియల్ వ్యూ రేట్లలో కొద్దిగా మార్పులు చేసినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఏరియల్ వ్యూ కోసం ఒక్కో ప్రయాణికుడికి రూ.4,500 నుంచి రూ.4,800 వరకు టికెట్ రేటు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిని జాయ్ రైడ్ గా పిలుస్తుండగా.. దాదాపు 7 నుంచి 8 నిమిషాల పాటు హెలికాప్టర్ లో మేడారం చుట్టూ తిప్పి చూపిస్తారు. గత జాతర లో మేడారం జాయ్ రైడ్ కు చాలా మంది భక్తులు ఆసక్తి చూపగా.. ఈసారి కూడా సేవలు కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇదిలాఉంటే హెలికాప్టర్ సేవలను కేవలం హనుమకొండ నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాగా ఆయా ప్రాంతాల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు టికెట్ ధర నిర్ణయించే అవకాశం ఉంది.
18 నుంచి ప్రత్యేక బస్సులు
ఈ నెల 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ కసరత్తు చేసింది. ఈ మేరకు మేడారంలో రూ.2.5 కోట్లతో ఏర్పాట్లు ప్రారంభించింది. మహాలక్ష్మీ పథకం ఎఫెక్ట్ తో దాదాపు 40 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలాఉంటే హెలికాప్టర్ సేవలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుండగా ఆర్టీసీ సేవలు మాత్రం ఈ నెల 18 నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్లలో టెంపరరీ ఆపరేటింగ్ పాయింట్ల పనులు ముమ్మరం చేశారు. భక్తులకు ప్రయాణ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రిపోర్టింగ్ - వరంగల్ జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం