Tsrtc New JD: టిఎస్ ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌గా అపూర్వరావు… బాధ్యతల స్వీకారం-apoorva rao as joint director of ts rtc assumption of responsibilities in office ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc New Jd: టిఎస్ ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌గా అపూర్వరావు… బాధ్యతల స్వీకారం

Tsrtc New JD: టిఎస్ ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌గా అపూర్వరావు… బాధ్యతల స్వీకారం

HT Telugu Desk HT Telugu
Feb 14, 2024 07:22 AM IST

Tsrtc New JD: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నూతన జాయింట్ డైరక్టర్ గా అపూర్వ రావు ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు.

TSRTC జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అపూర్వరావు
TSRTC జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అపూర్వరావు

Tsrtc New JD: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌గా హైదరాబాద్ బస్ భవన్ లోని ఐపీఎస్ అధికారి అపూర్వ రావు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న అపూర్వరావును టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్‌గా ప్రభుత్వం సోమవారం నియమించింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఆమె..2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి.

వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు ఎస్పీగా గతంలో పనిచేశారు. టీఎస్ఆర్టీసీకి జాయింట్ డైరెక్టర్ గా ఒక మహిళా ఐపీఎస్ అధికారిణి నియమితులవడం ఇదే తొలిసారి.

టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.అపూర్వరావుకు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని ఆమెకు సూచించారు.

ప్రజా రవాణా వ్యవస్థను ప్రాముఖ్యతను గుర్తించి టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఐపీఎస్ అధికారిని జాయింట్ డైరెక్టర్ గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సజ్జనర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనను జాయింట్ డైరెక్టర్ గా నియమించిందుకు ఈ సందర్బంగా ప్రభుత్వానికి శ్రీమతి కె.అపూర్వరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం విజయవంతంగా అమలవుతోందని, ఆ పథకం మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఆమె అన్నారు.

దేశ ప్రజా రవాణా వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తోన్న టీఎస్ఆర్టీసీ వృద్ధికి పాటుపడతానని చెప్పారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అపూర్వ రావుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆన్లైన్ బుకింగ్‌తో భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది.

గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా, ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్‌/ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది.

భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. పేటీఎం ఇన్‌ సైడర్‌ యాప్‌ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చు.

రాష్ట్ర రోడ్డు రావణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచనల మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం(బంగారం) అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బుకింగ్‌ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేస్తామని సంస్థ పేర్కొంది.

ఈ బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుందని,బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుంది అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ అన్నారు.

కార్గో కౌంటర్లలో ప్రసాదం బుకింగ్…

రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో ఈ సేవ అందుబాటులో ఉంటుందని సజ్జన్నార్ స్పష్టం చేశారు. పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని తెలిపారు.

లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్ లైన్ లో పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ ను తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు.

మేడారం ప్రసాద బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆయన సూచించారు.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

Whats_app_banner