Hyderabad Housing Projects : హైదరాబాద్ లో 74 శాతం హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి, సత్ఫలితాలిస్తున్న రెరా!
Hyderabad Housing Projects : రెరా అమలు అనంతరం హైదరాబాద్ లో మొదలైన 74 శాతం హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2017-18లో 110 హౌసింగ్ ప్రాజెక్టుల్లో 81 ప్రాజెక్కులు పూర్తి అయ్యాయి.
Hyderabad Housing Projects : రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (RERA) అమలు తర్వాత హైదరాబాద్ లో ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో దాదాపు 74 శాతం పూర్తి అయ్యాయని తెలుస్తోంది. అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం 2017 ద్వితీయార్థం నుంచి 2018 మధ్య నగరంలో ప్రారంభించిన మొత్తం 110 హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో మొత్తం 81 విజయవంతంగా పూర్తయ్యాయి. ఆలస్యమైన, నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టుల నుంచి గృహ కొనుగోలుదారులను రక్షించే ప్రాథమిక లక్ష్యంతో RERA ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లోనే కాకుండా భారతదేశంలోని టాప్ ఏడు నగరాల్లో కూడా ఈ లక్ష్యాన్ని సాధించడంలో రెరా చాలా వరకు విజయం సాధించింది.
86 శాతం ప్రాజెక్టులు పూర్తి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, COVID-19 మహమ్మారి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఏడు నగరాల్లో ప్రారంభించిన 1,642 (రెరాలో నమోదైన) రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో 86 శాతం పూర్తయ్యాయని అనరాక్ డేటా వెల్లడించింది. చెన్నై నగరంలో 90 శాతం హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి అయి ముందంజలో ఉంది. అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ...రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు సకాలంలో డెలివరీ ఇచ్చే విషయంలో రెరా(RERA) పూర్తిగా అమలవుతున్న ప్రతిచోటా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. రెరా అమలు తర్వాత 1.5 సంవత్సరాలలో టాప్ 7 నగరాల్లో మొత్తం 86 శాతం ప్రాజెక్టులు పూర్తి చేయడం విశేషం అని ప్రశంసించారు.
భారీ ప్రాజెక్టులకు ఎక్కువ సమయం
అనరాక్ నివేదిక ప్రకారం వివిధ కారణాల వల్ల నగరాల్లోని అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భారీ ప్రాజెక్ట్‌లు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతోంది. మరికొన్నింటిలో చిన్న డెవలపర్ల ప్రాజెక్ట్‌లు లిక్విడిటీ లేదా ఇతర సమస్యలతో నిలిచిపోతున్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న కారణంగా పలు ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని నివేదిక పేర్కొంది. ఆర్థికంగా బలమైన డెవలపర్లు మాత్రమే తమ ప్రాజెక్ట్‌లను ట్రాక్‌లో ఉంచుకోగలుగుతారని వెల్లడించింది.
రెరా హౌసింగ్ ప్రాజెక్ట్ పూర్తి రేటు
- హైదరాబాద్ - 74 శాతం
- బెంగళూరు - 85 శాతం
- ముంబయి మెట్రోపాలిటన్ ఏరియా - 89 శాతం
- పూణే - 89 శాతం
- చెన్నై - 90 శాతం