Pravalika Case : తెలంగాణలో సంచలనమైన ప్రవళిక ఆత్మహత్య కేసులో పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులపై బుధవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలే ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవళిక హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు అక్కడికి చేరుకొని ప్రవళిక గ్రూప్స్ పరీక్షలు తరుచూ వాయిదా పడడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని నిరసనకు దిగారు. అది ప్రభుత్వ హత్య అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసుల విచారణ అనంతరం ప్రవళిక తన ప్రియుడు శివరాం అనే వ్యక్తి మోసం చేసిన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు వెల్లడించారు. అలాగే ఇటీవలే ప్రవళిక కుటుంబ సభ్యులు కూడా తన కూతురు చావుకు శివరాం అనే యువకుడే కారణమని వాంగ్మూలం ఇచ్చారు. తన కూతురి చావుకు కారణమైన శివరాంను కఠినంగా శిక్షించాలని ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేశారు. ప్రణయ్ మాట్లాడుతూ తన అక్క ప్రవళికను శివరాం అనే వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని తనకు వాట్సప్ మెసేజ్ ద్వారా ప్రవళిక తెలిపిందన్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక మృతిని రాజకీయ నాయకులు తప్పు దోవ పట్టిస్తున్నారని పోలీసులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే మొత్తం 13 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భాను ప్రకాష్, సనత్ నగర్ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కోట నీలిమ సహా మొత్తం 14 మందిపై సెక్షన్ 143, 148, 341, 332 R/W 149 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. కాగా అటు ప్రవళిక కుటుంబసభ్యుల వాంగ్మూలం తీసుకున్న అనంతరం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన నిందితుడు శివరాం రాథోడ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు బుధవారం మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రవళిక మరణానికి శివరాం అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రిని కోరారు. ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలు డీజీపీ ద్వారా తెలుసుకున్నానని, ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్షపడేలా చూస్తామని మంత్రి అన్నారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్