Case On Daggubati Family : డెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి కుటుంబానికి షాక్, క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు-hyderabad news in telugu nampally court orders police file criminal case in daggubati family ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Case On Daggubati Family : డెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి కుటుంబానికి షాక్, క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

Case On Daggubati Family : డెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి కుటుంబానికి షాక్, క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Feb 06, 2024 07:09 PM IST

Case On Daggubati Family : హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానా, అభిరామ్ తో నిర్మాత సురేష్ పై క్రిమినల్ కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దగ్గుబాటు ఫ్యామిలీపై కేసు నమోదు
దగ్గుబాటు ఫ్యామిలీపై కేసు నమోదు

Case On Daggubati Family : టాలీవుడ్ అగ్రహీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలతో పాటు సురేష్, అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ లోని 'డెక్కన్‌ కిచెన్‌' హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి కుటుంబం డెక్కన్ కిచెన్ కూల్చివేసిందని ఆ హోటల్ యజమాని నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. హోటల్ కూల్చివేతతో తనకు రూ.20 కోట్లు నష్టం వాటిల్లిందని నందకుమార్ కోర్టుకు తెలిపారు. హోటల్ లీజు విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నా అక్రమంగా కూల్చివేశారని, విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని నందకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లతో తన హోటల్ ను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు... దగ్గుబాటు కుటుంబ సభ్యులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

దగ్గుబాటి ఫ్యామిలీ వాదన వేరేలా?

జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ 1లో దగ్గుబాటి కుటుంబానికి స్థలాలు ఉన్నాయి. వీటిలో వెంకటేష్‌ కు చెందిన 1000 గజాలు స్థలాన్ని ఐదేళ్ల క్రితం నందకుమార్‌ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. నందకుమార్ డెక్కన్ కిచెన్ పేరుతో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఈ స్థలానికి పక్కనే ఉన్న దగ్గుబాటి రానాకు చెందిన స్థలాన్ని కూడా నందకుమార్‌ లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. అయితే లీజు పూర్తయ్యాక కూడా తన స్థలంలో నిర్మాణాలు చేశారని రానా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు డెక్కన్ కిచెన్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి నిర్మాణాలను కూల్చివేశారు. అయితే దగ్గుబాటి కుటుంబం వందల మంది బౌన్సర్లతో తన రెస్టారెంట్ ను కూల్చివేశారని నందకుమార్ కోర్టును ఆశ్రయించారు.

నందకుమార్ పై కూడా కేసు నమోదు

దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన స్థలాన్ని నందకుమార్ తన స్థలంగా చెప్పి మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారన్న ఆరోపణలపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నిర్మాణాల కూల్చివేతకు కోర్టు స్టే ఇచ్చినా జీహెచ్ఎంసీ అధికారులు తన విలువైన బిల్డింగ్ కూల్చేశారనేది నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదుకు ఆదేశించింది.

Whats_app_banner