TG CMRF Online Apply : ఇకపై ఆన్ లోన్ లోనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
TG CMRF Online Apply : తెలంగాణ సీఎం సహాయ నిధి దరఖాస్తులను ఇకపై ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
TG CMRF Online Apply : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్ సైట్ ను రూపొందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్ ను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక ముందు సీఎం సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లో దరఖాస్తు
సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి ఆన్ లైన్ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ ను ఆమోదించి చెక్ ను సిద్ధం చేస్తారు. చెక్ పైన తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్ లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https://www.telangana.gov.in/cm-relief-fund/ వెబ్ సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.
బీఆర్ఎస్ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్ మాల్
తెలంగాణలో ఇటీవల సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నరేశ్, వెంకటేశ్, వంశీ, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే మాజీ మంత్రి హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అప్పట్లో హారీశ్ రావు కార్యాలయం వివరణ కూడా ఇచ్చింది. అతడు హరీశ్ రావు పీఏ కాదని తెలిపింది. మెదక్ కు చెందిన బాధితుడు రవి నాయక్ ఫిర్యాదుతో సీఎంఆర్ఎఫ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. రవి నాయక్ భార్య లలితను పొలం దగ్గర పాము కరవడంతో అమీర్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆసుపత్రిలో ఐదు లక్షలు బిల్లు కావడంతో రవి నాయక్ సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నాడు.
కొన్ని నెలలకు రవి నాయక్ దరఖాస్తుకు ఆన్ లైన్ లో సీఎంఆర్ఎఫ్ చెక్ సాంక్షన్ అయినట్లు చూపించడంతో అతడు సచివాలయానికి వెళ్లాడు. వైద్యఆరోగ్య శాఖ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న నరేశ్ ఆ చెక్ తీసుకున్నట్లు రవి నాయక్ కు అధికారులు తెలిపారు. దీంతో రవి నాయక్ నరేశ్ ను చెక్ కోసం అడిగాడు. ఆ చెక్ ను అసెంబ్లీలో అటెండర్ గా పనిచేస్తున్న వెంకటేశ్, డ్రైవర్ వంశీకి చెక్ ఇచ్చినట్లు నరేశ్ తెలిపాడు. నరేశ్, వెంకటేశ్, వంశీ కలిసి జూబ్లీహిల్స్ లోని ఎస్బీఐ బ్రాంచ్ లో రవి నాయక్ పేరుతో ఉన్న ఖాతాలో చెక్ వేసి 87,500 డ్రా చేశారు. నిందితులు ఇలాగే మరికొంత మంది చెక్కులను డ్రా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు.