CMRF Cheque Fraud : సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్, హరీశ్ రావు పీఏ అరెస్టు-కాదని కార్యాలయం క్లారిటీ!
CMRF Cheque Fraud : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్ మాల్ నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మాజీ మంత్రి హరీశ్ రావు పీఏ ఉన్నారని ప్రచారం జరిగింది. దీనిపై హరీశ్ రావు ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది.
CMRF Cheque Fraud : తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్(CMRF Cheque Fraud) వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నరేశ్, వెంకటేశ్, వంశీ, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మాజీ మంత్రి హరీశ్ రావు(Ex Minister Harish Rao PA) పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై హారీశ్ రావు కార్యాలయం వివరణ ఇచ్చింది. అతడు హరీశ్ రావు పీఏ కాదని తెలిపింది. మెదక్ కు చెందిన బాధితుడు రవి నాయక్ ఫిర్యాదుతో సీఎంఆర్ఎఫ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. రవి నాయకు భార్య లలితను పొలం దగ్గర పాము కరవడంతో అమీర్ పేట ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆసుపత్రిలో ఐదు లక్షలు బిల్ కావడంతో రవి నాయక్ సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నాడు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గోల్ మాల్
కొన్ని నెలలకు రవి నాయక్ దరఖాస్తుకు ఆన్ లైన్ లో సీఎంఆర్ఎఫ్ చెక్(CMRF Cheque) సాంక్షన్ అయినట్లు చూపించడంతో అతడు సచివాలయానికి వెళ్లాడు. వైద్యఆరోగ్య శాఖ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న నరేశ్ ఆ చెక్ తీసుకున్నట్లు రవి నాయక్ కు అధికారులు తెలిపారు. దీంతో రవి నాయక్ నరేశ్ ను చెక్ కోసం అడిగాడు. ఆ చెక్ ను అసెంబ్లీలో అటెండర్ గా పనిచేస్తున్న వెంకటేశ్, డ్రైవర్ వంశీకి చెక్ ఇచ్చినట్లు నరేశ్ తెలిపాడు. నరేశ్, వెంకటేశ్, వంశీ కలిసి జూబ్లీహిల్స్ లోని ఎస్బీఐ బ్రాంచ్ లో రవి నాయక్ పేరుతో ఉన్న ఖాతాలో చెక్ వేసి 87,500 డ్రా చేశారు. నిందితులు ఇలాగే మరికొంత మంది చెక్కులను డ్రా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
స్పందించిన హరీశ్ రావు కార్యాలయం
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ల గోల్ మాల్ వ్యవహరంలో హరీశ్ రావు పీఏ అరెస్టు(Harish Rao PA Arrest) అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై హరీశ్ రావు కార్యాలయం స్పందించింది. ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ ఈ చెక్ లు కాజేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో వాస్తవం లేదని హరీశ్ రావు కార్యాలయం పేర్కొంది. నరేశ్ ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ కాదని తెలిపింది. అతడు ఒక కంప్యూటర్ ఆపరేటర్ అని, గతంలో హరీశ్ రావు కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడని స్పష్టత ఇచ్చింది. మంత్రిగా హరీశ్ రావు పదవీకాలం ముగియడంతో ఆయన కార్యాలయాన్ని గత ఏడాది డిసెంబర్ 6న మూసివేసి, సిబ్బందిని పంపించేసినట్లు తెలిపింది. అప్పటి నుంచి నరేశ్ కు హరీశ్ రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. ఆఫీసు మూసివేసే క్రమంలో సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నరేశ్ కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను(CMRF Cheque Fraud) తీసుకువెళ్లినట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంలో నరేశ్ అనే వ్యక్తిపై 2023 డిసెంబర్ 17న నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారంతో, నరేశ్ అనే వ్యక్తితో హరీశ్ రావుకు గానీ, ఆయన కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.