Hyderabad Crime : బావమరిది చావు కోరిన బావ, ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా డ్రామా!
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత బావమరిదిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఓ బావ. అత్తమామలు, భార్యను నమ్మించి బావమరిది మృతదేహానికి అంత్యక్రియలు సైతం పూర్తి చేయించాడు. అయితే మామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్లుడి కిరాతకం బయటపడింది.
Hyderabad Crime : బావమరిది బావ బతుకు కోరితే...బావ మాత్రం బావమరిది చావు కోరుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ చోటుచేసుకున్నారు. బావమరిదిని అడ్డు తప్పిస్తే ఆస్తి మొత్తం తనదవుతుందని ప్లాన్ వేశాడు ఓ బావ. అనుకున్నట్లే బావమరిదిని చున్నీతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. బావమరిది ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తమామలు, భార్య, బంధువులను నమ్మించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై శనివారం మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ వివరాలు తెలిపారు.
అసలేం జరిగింది?
ఏపీలోని నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో పెళ్లి జరిగింది. శ్రీకాంత్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి జయభేరి కాలనీలో హాస్టల్ నడుపుతున్నాడు. ఆన్ లైన్ గేమింగ్‌తో పాటు చెడు వ్యసనాలతో శ్రీకాంత్ భారీగా అప్పులు చేశాడు. గత కొంత కాలంగా శ్రీకాంత్ భార్య సోదరుడు యశ్వంత్(25)... అక్క, బావతో కలిసి ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుల్లో కూరుకుపోయిన శ్రీకాంత్... తన మామ ఆస్తిపై కన్నేశాడు. బావమరిదిని అడ్డుతొలగిస్తే ఆస్తి మొత్తం తనకే సొంతమవుతుందని ప్లాన్ వేశాడు.
శ్రీకాంత్ తన హాస్టల్ వంట మనిషి ఆనంద్‌కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి యశ్వంత్ ను మర్డర్ చేయమని చెప్పాడు. సెప్టెంబర్ 1న శ్రీకాంత్, ఆనంద్ అతని స్నేహితుడు వెంకటేష్… హాస్టల్‌లో ఉన్న యశ్వంత్ రూమ్ కు వెళ్లి చున్నీతో అతడి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించారు. యశ్వంత్ మృతదేహాన్ని కారులో ఏపీ బోర్డర్ వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నెల్లూరు జిల్లాలోని అగ్రహారానికి తరలించారు. యశ్వంత్ సూసైడ్ చేసుకున్నాడని అత్తమామలను, వారి బంధువులను శ్రీకాంత్ నమ్మించాడు.
మామ ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి
యశ్వంత్ అంత్యక్రియలు పూర్తైన కొన్ని రోజులకు కుటుంబ సభ్యలు హాస్టల్ లో సీసీ కెమెరాల గురించి ఆరా తీశారు. హాస్టల్‌లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వారికి అనుమానం వచ్చి ఈనెల 10న గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. యశ్వంత్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని పోలీసుల స్టైల్ లో విచారించగా నిందితుడి నిజం చెప్పాడు. శ్రీకాంత్‌తో పాటు మరో అతడి సహాకరించిన ఆనంద్, వెంకటేష్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన చున్నీ, కారు, బైక్ , రూ.90వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్న ఘటనలకు ఈ కేసు మరో ఉదాహరణగా మిలిగింది.
సంబంధిత కథనం