Medak Tragedy : మెదక్ జిల్లాలో విషాదం.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్
Medak Tragedy : మెదక్ జిల్లాలో విషాదం జరిగింది. తోబుట్టువులతో భూ వివాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ రైతు.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో సుతార్ పల్లి గ్రామంలో జరిగింది.
రామాయంపేట మండలంలోని సుతార్ పల్లి గ్రామానికి చెందిన పున్న స్వామి (45).. వ్యవసాయంతో పాటు కోళ్లఫారం నడుపుతున్నారు. స్వామికి భార్య సుశీలమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిపించారు. ఒక కుమార్తెను అదే గ్రామంలో నివసిస్తున్న తన చెల్లి పుష్ప కుమారునితో వివాహం జరిపించాడు.
సెల్ఫీ వీడియోతో..
కొంతకాలంగా స్వామికి, చెల్లెలు పుష్పతో భూ వివాదం నడుస్తుంది. స్వామిని కొందరు నేతల అండతో అతని తల్లి, చెల్లెలు తరచూ వేధించారు. ఈ వివాదంలో కొందరు వ్యక్తులు స్వామిని బెదిరించారు. దీంతో మనస్థాపం చెందిన స్వామి.. నాలుగు రోజుల క్రితం తన పౌల్ట్రీ ఫామ్ లో గడ్డి మందు తాగాడు. దీనికి తన చెల్లి సహా పలువురు కుటుంబీకులు, మరో ఇద్దరు నేతలు కారణమని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దాన్ని తన కుమార్తెకు పంపించాడు. అపస్మారక స్థితికి చేరుకున్న స్వామిని కుటుంబసభ్యులు రామాయంపేటకు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామి శుక్రవారం మృతి చెందాడు.
కుటుంబసభ్యుల ఆందోళన..
స్వామి మృతదేహంతో బంధువులు, గ్రామస్థులు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రహదారిపై బైఠాయించారు. స్వామి ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గంటల పాటు ఆందోళన చేపట్టగా.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీఐ వెంకటరాజాగౌడ్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో.. వారు శాంతించారు. మృతుడి భార్య సుశీల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చెల్లి కొడుకుతోనే కూతురు వివాహం..
తాను చనిపోయిన తర్వాతనైనా.. తన కూతురుకు న్యాయం చేయాలనీ, సెల్ఫీ వీడియోలో గ్రామ పెద్దలను రెండు చేతులు జోడించి వేడుకున్నాడు. తాను ఎటువంటి అక్రమాలు చేయలేదని.. న్యాయంగా తన కూతురుకు వచ్చే ఆస్తిని ఇప్పించాలని అభ్యర్థించారు. అయితే.. ఈ విషాదానికి కారణం.. స్వామి చెల్లెలు పుష్ప అని గ్రామస్తులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)