Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు-ఆరు జోన్లలో 5 చెరువులు, 73 కుంటలు సిద్ధం-hyderabad ganesh nimajjanam on september 17 ghmc put huge cranes at hussain sagar 73 baby ponds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు-ఆరు జోన్లలో 5 చెరువులు, 73 కుంటలు సిద్ధం

Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు-ఆరు జోన్లలో 5 చెరువులు, 73 కుంటలు సిద్ధం

Bandaru Satyaprasad HT Telugu
Sep 14, 2024 09:49 PM IST

Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి శరవేగంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని ఇతర చెరువులతో పాటు తాత్కాలిక కుంటలను సిద్దం చేస్తున్నారు. మొత్తం ఆరు జోన్లలో 5 పెద్ద చెరువులతోపాటు 73 కుంటలను సిద్ధం చేశారు.

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు-ఆరు జోన్లలో 5 చెరువులు, 73 కుంటలు సిద్ధం
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు-ఆరు జోన్లలో 5 చెరువులు, 73 కుంటలు సిద్ధం

Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడ్ని గంగమ్మలో నిమజ్జనం చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 17న వినాయక నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని ఇతర చెరువులతో పాటు బేబీ పాండ్స్, పూల్ పాండ్స్ ను సిద్ధం చేస్తోంది. నిమజ్జనానికి భారీ క్రేన్లు, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడానికి సిబ్బంది, వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఆరు జోన్లలో 73 నిమజ్జన కుంటలు

జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్ష గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉంది. హుస్సేన్‌ సాగర్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులను సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌, పీవీ మార్గ్‌లో ఇప్పటికే భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. పీవీ మార్గ్‌లో నిమజ్జనాల సందడి మొదలైంది. ఈ నెల 17న భారీగా గణనాథులు సాగర్ వైపు తరలి రానున్నారు. నగరంలో మొత్తం ఆరు జోన్లలో ఐదు పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా 73 కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. కూకట్ పల్లి జోన్ లో 11, ఎల్బీనగర్ జోన్ లో 12, ఛార్మినార్ జోన్‌లో 10, ఖైరతాబాద్ జోన్‌లో 13, శేరిలింగంపల్లి జోన్‌లో 13, సికింద్రాబాద్ జోన్‌లో 12 తాత్కాలిక కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేశామన్నారు.

శరవేగంగా ఏర్పాట్లు

ఇక ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే శోభయాత్ర మార్గంలో చెట్ల కొమ్మలను తొలగించారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషర్ ఆమ్రపాలి తెలిపారు. విగ్రహాలు వచ్చే మార్గంలో చెట్ల కొమ్మల తొలగింపు, రహదారి మరమ్మతులు, బారికేడ్లు, విద్యుత్ దీపాలు అమర్చే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. గణేష్ నిమజ్జన ప్రక్రియకు 140 స్టాటిక్ క్రేన్‌లు, 295 మొబైల్ క్రేన్లు, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 160 గణేష్ యాక్షన్ టీమ్ లు ఏర్పాటు చేశామని ఆమ్రపాలి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 308 మొబైల్ మరుగుదొడ్లు కూడా సిద్ధం చేశామన్నారు.

25 వేల మందితో బందోబస్తు

హైదరాబాద్‌ లో గణేష్ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. లక్షకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనాకి తరలివస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఘర్షణలు, ప్రాణనష్టం, సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో 15 వేల మంది సిబ్బంది, బయట నుంచి 10 వేల సిబ్బందిని బందోబస్తుకు సిద్ధం చేశామన్నారు. సెప్టెంబర్ 16, 17న రెండ్రోజుల పాటు పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతాయన్నారు. ఈ రెండ్రోజులు 25 వేల మంది పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు కాస్తారని తెలిపారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత కథనం