Hyderabad Wines Close : లిక్కర్ కిక్కుకు బ్రేక్.. 17, 18 తేదీల్లో వైన్ షాపులు బంద్.. హైదరాబాద్ పోలీసుల ఆదేశాలు-police orders closure of wine shops in hyderabad city on september 17 and 18 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Wines Close : లిక్కర్ కిక్కుకు బ్రేక్.. 17, 18 తేదీల్లో వైన్ షాపులు బంద్.. హైదరాబాద్ పోలీసుల ఆదేశాలు

Hyderabad Wines Close : లిక్కర్ కిక్కుకు బ్రేక్.. 17, 18 తేదీల్లో వైన్ షాపులు బంద్.. హైదరాబాద్ పోలీసుల ఆదేశాలు

Basani Shiva Kumar HT Telugu
Sep 14, 2024 02:43 PM IST

Hyderabad Wines Close : హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో.. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులు వైన్స్, బార్లు, కల్లు కాంపౌడ్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండ్రోజులు కిక్కుకు బ్రేక్ పడనుంది.

జంట నగరాల్లో రెండ్రోజులు వైన్స్ బంద్
జంట నగరాల్లో రెండ్రోజులు వైన్స్ బంద్

సెప్టెంబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని అన్ని వైన్స్, బార్, కల్లు కాంపౌడ్లు మూసివేయనున్నారు. హైదరాబాద్ పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేరిట తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు జంట నగరాల పరిధిలోని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్పెక్టర్‌లకు అధికారం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

నిమజ్జనం రోజు పాటించాల్సిన నియమాలు..

హైదరాబాద్ మహా నగరంలో.. గణపతి నిమజ్జనం రోజు పాటించాల్సిన నియమాలను కూడా పోలీసులు వివరించారు. భక్తులు నిబంధనలు పాటించి.. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

1.గణేష్ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు.

2.నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై సౌండ్ బాక్స్‌లు, డీజేలు అమర్చొద్దు.

3.నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లే వాహనంలో మద్యం, ఇతర మత్తు పధార్థాలను, మద్యం తాగిన వ్యక్తులను అనుమతించరు.

4.గణపతి నిమజ్జనం ఊరేగింపులో కర్రలు, కత్తులు, మండే పధార్థాలు, ఇతర ఆయుధాలను తీసుకురావొద్దు.

5.వెర్మిలియన్, కుంకుమ్, గులాల్‌ను సామాన్య ప్రజలపై జల్లకూడదు.

6.గణేష్ ఊరేగింపులో రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే నినాదాలు చేయొద్దు.

7.గణపతి ఊరేగింపు సమయంలో బాణాసంచా పేల్చొద్దు.

8.పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలి.

9.ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. వెంటనే డయల్ 100 కి ఫోన్ చేయాలి.

రాత్రంతా.. ఎంఎంటీఎస్ సేవలు..

గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుండి 18 మధ్య రాత్రి వరకు జంట నగరాల్లోని వివిధ గమ్యస్థానాల మధ్య కొన్ని ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపాలని నిర్ణయించింది. 8 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. గణపతి భక్తులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.

రైలు నెం- GHL-5 (హైదరాబాద్- లింగంపల్లి) సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి.. అదే రోజు రాత్రి 11:55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

రైలు నెం- GHS-1 (సికింద్రాబాద్- హైదరాబాద్) సెప్టెంబర్ 17 రాత్రి 11:50 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి 12:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

రైలు నెం- GHS-6 (లింగంపల్లి- ఫలక్‌నుమా) సెప్టెంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 12:10 గంటలకు లింగంపల్లి నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 1:50 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది.

రైలు నెం- GHS-7 (ఫలక్‌నుమా- సికింద్రాబాద్) సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 2:20 గంటలకు ఫలక్ నుమా నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఫలకున్మా చేరుకుంటుంది

Whats_app_banner