Warangal Fire Accident: వరంగల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.2కోట్ల ఆస్తి నష్టం..
Warangal Fire Accident: గ్రేటర్ వరంగల్ నగరంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోట్ల రుపాయల ఆస్తి నష్టం జరిగింది.
Warangal Fire Accident: వరంగల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో Shopping complex షాపింగ్ కాంప్లెక్స్ కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో.. కాంప్లెక్స్ లోని మూడు అంతస్తులు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి.
అప్పటికే రాత్రి అవడం, కాంప్లెక్స్ లో జనాలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నగరం నడిమధ్యలో ఉన్న కాంప్లెక్స్ మంటల్లో తగలబడు తుండటం, పక్కనే పెట్రోల్ బంక్ లు ఉండటంతో చుట్టుపక్కల ఇండ్లు, కాంప్లెక్స్ ల జనాల తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి Konda surekha కొండా సురేఖ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మంటలు చెలరేగగా..పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ Pochamma Maidan పోచమ్మ మైదాన్ సెంటర్ లోని జకోటియా కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ లో గురువారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ వస్తుండటాన్ని గమనించిన అక్కడి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం కాంప్లెక్స్ లోని మిగతా షాపుల నిర్వాహకులను అప్రమత్తం చేశారు. కొద్ది సేపటికే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. మూడో అంతస్థులో ఉన్న బ్యాంక్వెట్ హాలులోకి కూడా మంటలు వ్యాపించాయి.
ఘటనా స్థలానికి మంత్రి సురేఖ
సిటీ మధ్యలో ఉన్న కాంప్లెక్స్ మంటలు చెలరేగడం, పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర దేవాదాయ, ఆటవీశాఖ మంత్రి కొండా సురేఖ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగసి పడుతున్న మంటలను పరిశీలించి అప్పటికప్పుడు మున్సిపల్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో ఫోన్ మాట్లాడారు. మంటలను వెంటనే అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
అప్పటికే ఘటనా స్థలానికి ఒక ఫైర్ ఇంజిన్ రాగా.. మంత్రి ఆదేశాలతో మరో మూడు ఫైర్ ఇంజిన్లు రప్పించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ప్రమాదానికి గల కారణాలను అక్కడి సిబ్బంది, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మంటలతో యుద్ధం.. 2 కోట్ల నష్టం
ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరు కొని అర్ధరాత్రి వరకు మంటలకు ఆర్పే పనిలోనే నిమగ్నమయ్యారు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ. డీసీపీ దేవేందర్ రెడ్డితో పాటు ఐదుగురు సీఐలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాగా అప్పటికే జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం, రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
మంటలకు కాంప్లెక్స్‌లోని ఏసీ కంప్రెషర్లు అన్ని పేలడంతో ఆ భారీ శబ్దాలకు జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మూడు ఫైరింజన్లతో పాటు మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
బిల్డింగ్ కు మూడు వైపులా నీటిని చిమ్మించేందుకు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ కొద్దిసేపటికి మళ్లీ మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం కూడా మంటలు విస్తారంగా వ్యాప్తి చెందడంతో సిబ్బంది మళ్లీ అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడి సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీవంలో పెట్రోల్ పంపులు కూడా ఉండటంతో పరిసరాల్లో ఉండే జనం, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన సీఐ
మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు మట్వాడా సీఐ తుమ్మ గోపి కూడా తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే పొగ, వేడికి సీఐ గోపి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎగిసిపడుతున్న మంటల నుంచి భారీ స్థాయిలో పొగలు ఎగరావడంతో శ్వాస సంబంధ సమస్య తలెత్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో గమనించిన సిబ్బంది వెంటనే ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో అడ్మిట్ చేసి, చికిత్స అందించడంతో సీఐ గోపి కోలుకున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం