Lok Sabha Elections 2024 : రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో 'నిరంతర నిఘా'
Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గడ్చిరోలి లో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు సమావేశమయ్యారు.
Lok Sabha Elections 2024 : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections 2024:) నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. గడ్చిరోలి లో సమావేశమై జాయింట్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. సరిహద్దులో డేగ కన్నులతో పహారా కాస్తూ మావోలను ఏరివేసి, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు గడ్చిరోలి లో సమావేశమయ్యారు. గడ్చిరోలి డిప్యూటీ ఐజిపి అంకిత్ గోయల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు, గడ్చిరోలి CRPF ఇన్‌స్పెక్టర్ జనరల్ జగదీష్ ఎన్.మీనా, గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్, గోండియా ఎస్పీ నిఖిల్ పింగళే, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ K. సురేష్ కుమార్, మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్, బీజాపూర్ (ఆపరేషన్స్) అదనపు ఎస్పీ వైభవ్ బంకర్, భానుప్రతాపూర్ (కంకేర్) అదనపు ఎస్పీ సందీప్ కుమార్ పటేల్, నారాయణపూర్ అడిషనల్ ఎస్పీ
రాబిన్సన్ గురియా, మొహల్లా-మన్పూర్ డిప్యూటీ ఎస్పీ తాజేశ్వర్ దివాన్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహాద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి చర్చించారు. ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘాపెట్టి సంబంధిత సమాచారాన్ని పరస్పరం షేర్ చేసుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరమవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించవచ్చని సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా…
మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా సమిష్టిగా కృషిచేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని.. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులో ఉన్న సమస్యాత్మకమైన గ్రామలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. NBW వారెంట్స్ ల విషయంలో మూడు రాష్ట్రాల పోలీసులు ఒకరి ఒకరు సహకరించుకోవాలని, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించాలని సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని, నేరాల కట్టడి, కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకుందామని నిర్ణయించారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇరురాష్ట్రాల అధికారులు చర్చించి, పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రామగుండం సిపి ఏరియల్ సర్వే..
గడ్చీరోలిలో జరిగే సమావేశానికి రామగుండం సిపి, ఆసిఫాబాద్, భూపాలపల్లి ఎస్పీలు, మంచిర్యాల డీసీపీ హెలికాప్టర్ లో రాష్ట్ర సరిహద్దులో ఏరియల్ సర్వే నిర్వహించారు. రామగుండం నుంచి గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ సరిహద్దు లో ఏరియల్ సర్వే చేసి మహారాష్ట్ర ఛత్తీస్ గడ్ పోలీసులకు పలు సూచనలు చేశారు. నేలపైనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ కెమెరా ద్వారా ఆకాశం నుంచి అటవీ ప్రాంతాన్ని గాలించాలని నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు.