Hyderabad Politics : హాట్ సీట్ గా మారిన " హైదరాబాద్ " పార్లమెంట్ స్థానం, ఈసారి గెలుపెవరిదో?-hyderabad in telugu lok sabha elections majlis bjp congress candidate tough fight ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad Politics : హాట్ సీట్ గా మారిన " హైదరాబాద్ " పార్లమెంట్ స్థానం, ఈసారి గెలుపెవరిదో?

Hyderabad Politics : హాట్ సీట్ గా మారిన " హైదరాబాద్ " పార్లమెంట్ స్థానం, ఈసారి గెలుపెవరిదో?

HT Telugu Desk HT Telugu
Mar 16, 2024 09:30 PM IST

Hyderabad Politics : ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ హోరాహోరీగా జరగనుంది. ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలో దించుతుండడంతో మజ్లిస్ విజయం అంత సులభం కాదంటున్నారు విశ్లేషకులు.

హాట్ సీట్ గా మారిన " హైదరాబాద్ " పార్లమెంట్ స్థానం
హాట్ సీట్ గా మారిన " హైదరాబాద్ " పార్లమెంట్ స్థానం

Hyderabad Politics : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి(Hyderabad Lok Sabha) పోటీ అనూహ్యంగా పెరుగుతుంది. సాధారణంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఫలితాలు ఏకపక్షంగా ఉండేవి. ముస్లింలు అధికంగా ఉన్న ఈ పార్లమెంట్ స్థానంలో గత కొన్నేళ్లుగా మజ్లిస్ పార్టీదే పై చేయి. గతంలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే....మజ్లిస్(Majlis) పార్టీ అభ్యర్థికి, బీజేపీ(BJP) అభ్యర్థికి మధ్య మాత్రమే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఎంఐఎం ఇక్కడి నుంచి సులభంగా గెలుస్తుందని అని భావిస్తున్నా.....రోజు రోజుకు ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదురు కోవడానికి ఇటు బీజేపీ తో పాటు కాంగ్రెస్, బీఎస్పీ, ఎంబీటీ పార్టీలు సిద్ధం అవుతున్నాయి.

మజ్లిస్ పార్టీకి ధీటుగా

హైదరాబాద్ పార్లమెంట్(Hyderabad Politics) పరిధి రాజకీయాల్లోకి తాజాగా ఇప్పుడు తెరపైకి బీఎస్పీ పార్టీ వచ్చింది. ఇదిలా ఉంటే ఎన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉన్న తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని మజ్లిస్ అధినేత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల పొత్తులో భాగంగా తమకు దక్కిన హైదరాబాద్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని బీఎస్పీ అంటోంది. దళిత, బడుగు బలహీన వర్గాల ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నందున తన పార్టీకి ఆదరణ తప్పక లభిస్తుందని ఆయన కూడా ధీమాతో ఉన్నారు. ఇక ఇన్ని రోజులు హైదరాబాద్ స్థానానికి ప్రధాన పోటీ మజ్లిస్, బీజేపీ మధ్యనే ఉన్నప్పటికీ ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ గాలివీస్తుందని.....ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ బలమైన అభ్యర్థి బరిలో దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అలీ మస్కతిను బరిలో దింపుతారని ప్రచారం సాగుతోంది.

గులాబీ పార్టీ మజ్లిస్ తో దోస్తానా వదులుకొక తప్పదా?

మరో పక్క ఇక్కడ బీజేపీ అధిష్టానం మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఆ పార్టీ నుంచి విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవి లత(BJP Madhavi Latha) పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటికే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పాత బస్తీ ప్రజలకు సుపరిచితురాలు అయ్యారు. మంచి వాగ్దాటితో మాధవి లత ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆమె మజ్లిస్ పార్టీకి గతంలో కంటే ఈసారి గట్టి పోటీ ఇస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక గతంలో మజ్లిస్ పార్టీతో దోస్తానా కొనసాగించిన బీఆర్ఎస్ (BRS)తమ పార్టీ తరఫున ఒక డమ్మీ అభ్యర్థిని ఇక్కడ బరిలో పెట్టి పరోక్షంగా మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకుర్చేది. అయితే ఈసారి మాత్రం అలా జరగదని ఆ పార్టీ అధిష్ఠానం చెబుతుంది. పొత్తులో భాగంగా ఈసారి హైదరాబాద్ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించి నందున గులాబీ నేతలు బీఎస్పీకు సానుకూలంగా, మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ఇక ముస్లిం వర్గానికి చెందిన ఎంబీటీ పార్టీ కూడా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మజ్లిస్ పార్టీకి పోటీగా ఎంబీటీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అంజధుల్ల ఖాన్ బరిలో దిగానున్నట్టు తెలుస్తుంది.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం