Asaduddin Owaisi relationship advice : దేశంలో పెరిగిపోతున్న గృహ హింస ఘటనలను ఖండించారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. భార్యలు అరిస్తే.. భర్తలు సహనంతో ఉండాలని సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.
అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది ఏఐఎంఐఎం. గృహ హింసకు సంబంధించి.. ఓ సభలో ఆయన ప్రసంగించిన వీడియో అది.
"భార్యలతో భర్తలు మంచిగా ప్రవర్తించాలి. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఈ మాటలు కొందరికి బాధ కలిగిస్తాయి. భార్యలు ఉన్నది వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి, తలకు మసాజ్ చేయడానికే అని ఖురాన్లో లేదు. ఇంకా చెప్పాలంటే.. భార్య సంపదపై భర్తకు హక్కు లేదు. భర్త సంపదపై మాత్రం భార్యకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇంటిని మహిళే కదా నడిపించేది. అది చిన్న విషయం కాదు," అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Asaduddin Owaisi latest news : "వంట సరిగ్గా చేయడం లేదని.. చాలా మంది వారి భార్యలను తిడుతుంటారు. కానీ.. సోదరులారా, ఇది ఇస్లాం. అలా చేయాలని ఎక్కడా రాసి లేదు. అంతేకాదు. కొందరు, వారి భార్యల పట్ల కృరంగా ప్రవర్తిస్తారు. కొడతారు. మీరు నిజంగా మహమ్మద్ ప్రవక్తని ప్రార్థిస్తూ, ఆయన చెప్పిన మార్గంలో నడవాలని అనుకుంటే.. అలా చేయకండి. ప్రాఫెట్ ఎప్పుడు అలా చేయలేదు. భార్యలపై అరిస్తే.. అది మగతనం కాదు. భార్య కోపంగా ఉంటే, పురుషులు సహనంతో ఉండటమే మగతనం," అని ఓవైసీ చెప్పుకొచ్చారు.
"నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఓసారి.. రసూల్ అనే వ్యక్తి, ఫరూక్ ఈ అజామ్ దగ్గరికి వెళ్లాడు. "నా భార్య నా మీద ఎప్పుడు కోపంగానే ఉంటోంది," అని ఫిర్యాదు చేశాడు. అది విన్న ఫరూక్.. రసూల్‌ని తన ఇంటికి తీసుకెళ్లాడు. అదే సమయంలో.. ఫరూక్ భార్య, ఆయన్ని తిట్టడం మొదలుపెట్టింది. అది గమనించాడు రసూల్. అతనితో ఫరూక్.. ఈ విధంగా అన్నాడు.. 'ఆమె నా భార్య. నా బిడ్డలకు జన్మనిచ్చింది. అన్ని పనులు చూసుకుంటుంది. నా ఇంటి పరువును కాపాడుతుంది. కానీ.. ఆమె కూడా మనిషే కదా. కోపం అనేది సహజం. కోపంలో తను ఏమైనా అంటే.. నేను ఎదురించను. ఆమె మాటలను వింటాను. నువ్వు కూడా ఈ మైండ్‌సెట్‌ని అలవాటు చేసుకో,'" అని అసదుద్దీన్ తన కథను ముగించారు.
Asaduddin Owaisi on domestic violence : "చాలా మంది.. అర్థరాత్రి అయినా ఇంటికి వెళ్లారు. స్నేహితులతో ఉంటారు. అదే సమయంలో.. వారి తల్లులు, భార్యలు వారి కోసం ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలి," అని ఓవైసీ అన్నారు.
సంబంధిత కథనం