Family Planning Operations : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మృతి.. ప్రభుత్వం ఏం చెబుతుందంటే?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. వరుసగా 3 రోజుల్లో నలుగురు మహిళలు చనిపోయారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. సామూహిక స్టెరిలైజేషన్ శిబిరంలో భాగంగా నిర్వహించిన శస్త్ర చికిత్సలు కొంతమందికి వికటించాయి. వివిధ సమస్యలతో నలుగురు మహిళలు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
మృతులు: మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మైలారం సుష్మ (26), నర్సాయిపల్లికి చెందిన ఎన్ మమత (25), కొలుకులపల్లి తండాకు చెందిన మౌనిక (26), సీతారాంపేట గ్రామానికి చెందిన అవుతారం లావణ్య (27).
ఇబ్రహీంపట్నం సీహెచ్‌సిలో మొత్తం 34 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇందులో నలుగురు నచిపోయారు. మిగిలిన మహిళల పరిస్థితి నిలకడగా ఉంది. వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరణించిన వారిలో మమత ఆదివారం రాత్రి మృతి చెందగా, సుష్మ సోమవారం మృతి చెందింది. 'మిగిలిన ఇద్దరు మంగళవారం తెల్లవారుజామున మరణించారు.' శ్రీనివాసరావు చెప్పారు.
ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీ మెడికల్ సూపరింటెండెంట్‌ను జీవితకాల సస్పెన్షన్‌లో ఉంచామని డీహెచ్ తెలిపారు. లాప్రోస్కోపిక్ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసిన వైద్యులను కూడా సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. శస్త్రచికిత్సలపై లోతైన విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దోషులుగా తేలితే వైద్యుల లైసెన్సులు రద్దు చేస్తామని శ్రీనివాసరావు అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెలా ఇలాంటి స్టెరిలైజేషన్ క్యాంపులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. 'అనుభవజ్ఞులైన వైద్యులు డబుల్-పంక్చర్ లాప్రోస్కోపీ (DPL), ట్యూబెక్టమీ, వేసెక్టమీ సర్జరీలు చేస్తారు. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా ఎందుకు అయిందని కచ్చితమైన కారణాలను మేం వెల్లడిస్తాం.' అని డీహెచ్ పేర్కొన్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న 34 మంది మహిళల్లో నలుగురు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌తో బాధపడుతున్నారని డీహెచ్ శ్రీనివాసర్ అన్నారు. చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో చేరారని చెప్పారు. ఇతర శస్త్రచికిత్సలతోపోల్చుకుంటే.. DPL పద్ధతికి ప్రాధాన్యత ఎక్కువని వెల్లడించారు. ఎక్కువ మంది ఇదే చేయించుకుంటారని, అదే రోజున డిశ్చార్జ్ అవుతారన్నారు.
అయితే ఈ ఘటన జరగడం దురృష్టకరమని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచితంగా విద్యనందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.