నాలుగేళ్ల చిన్నారి కోసం 48 గంటల రెస్క్యూ ఆపరేషన్-4 years child missing in kuppam forest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నాలుగేళ్ల చిన్నారి కోసం 48 గంటల రెస్క్యూ ఆపరేషన్

నాలుగేళ్ల చిన్నారి కోసం 48 గంటల రెస్క్యూ ఆపరేషన్

HT Telugu Desk HT Telugu
Apr 19, 2022 09:44 AM IST

ఇంటి ముందు స్నేహితులతో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైంది. చుట్టు పక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. వందలాది మంది గ్రామస్తులు, భారీ ఎత్తున పోలీసు బలగాలు చిన్నారి కోసం రంగంలోకి దిగాయి. 48గంటల తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్నారి అచూకీ కనుగొన్నారు.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

 

చిత్తూరు జిల్లా కుప్పం అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చిన్నారి అచూకీ కోసం పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. దీనికి కారణం పాప గల్లంతైన ప్రాంతం దట్టమైన అడవులకు దగ్గర్లో ఉండటమే....

కుప్పం మండలంలోని నక్కలగుంట గ్రామం అటవీ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో క్రూర మృగాల సంచరంతో పాటు, ఏనుగుల దాడి సర్వసాధారణం.  కుప్పం ద్రావిడ యూనివర్శిటీలో  పనిచేసే ఉద్యోగి కుమార్తె శనివారం సాయంత్రం ఇంటి ముందు స్నేహితులతో ఆడుకుంటోంది. చీకటి పడే సమయానికి  చిన్నారిని ఇంట్లోకి తీసుకువెళ్లేందుకు వచ్చిన తల్లికి కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో వెదికినా అచూకీ లభించలేదు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటికి స్థానికులు సమాచారం చేరవేయడంతో ఆ గ్రామాల ప్రజలు తెల్లవార్లు చిన్నారి కోసం వెదికారు. ఆదివారం ఉదయాన్నే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

చిన్నారి జోషిక కుటుంబం నివసిస్తున్న నక్కలగుట్ట ప్రాంతం దట్టమైన అడవులకు సమీపంలో ఉండటంతో వన్యప్రాణులు చిన్నారికి హాని చేస్తాయనే ఉద్దేశంతో  సమీప గ్రామాల ప్రజలు స్వచ్ఛంధంగా అడవుల్లో గాలింపు ప్రారంభించారు. పోలీసులు కూడా ఆదివారం సాయత్రం వరకు గాలింపు జరిపినా పలితం లేకపోయింది. అటవీ ప్రాంతంలో ఉన్న నీటి కుంటలు, గ్రామ శివార్లలో వ్యవసాయ బావుల్లో కూడా గాలింపు నిర్వహించారు. 

 

జాగిలాలతో గాలింపు.....

 

చిన్నారి అచూకీ లబించకపోవడంతో స్నిఫర్ డాగ్‌లను కూడా బాలిక అచూకీ కోసం వినియోగించారు. చిన్నారి చెప్పులు, దుస్తులు వాసన ఆధారంగా  ఎటూ వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. పిల్లలు ఆడుకున్న ప్రదేశం నుంచి అటవీ ప్రాంతం ప్రారంభమయ్యే వరకు వెళ్లే జాగిలం నిలిచిపోయింది. ఆ తర్వాత  వాసనలు గుర్తించలేకపోయింది.  దీంతో బాలిక కిడ్నాప్‌కు గురై ఉంటుందని పోలీసులు అనుమానించారు. దీంతో ఎస్పీ రిషాంత్ రెడ్డి చుట్టు పక్కల జిల్లాల పోలీసుల్ని అప్రమత్తం చేశారు. చిత్తూరుతో పాటు పొరుగున ఉన్న జిల్లాల పోలీసులు కూడా చిన్నారి కోసం రంగంలోకి దిగారు. అటు తమిళనాడు, కర్ణాటక పోలీసుల సాయం కూడా కోరారు. బాలిక అచూకీ కనిపెట్టేందుకు కుప్పం పోలీసులు సోమవారం ఉదయాన్నే గాలింపు ప్రారంభించారు. మధ్యాహ్నానికి దట్టమైన అటవీ ప్రాంతంలో పొదల్లో పడి ఉన్న చిన్నారిని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఒంటిపై స్వల్ప గాయాలతో ములుగుతుండటంతో హుటాహుటిన కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

 

చిన్నారి అదృశ్యంపై అనుమానాలు....

ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. నాలుగేళ్ల చిన్నారి రెండు రాత్రులు దట్టమైన అడవిలో ఎలా గడిపింది అనేది మిస్టరీగా మారింది. పోలీసులు మాత్రం బాలికను అపహరించే ప్రయత్నంలో పోలీసులకు భయపడి అడవిలో వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు.  తిండి, నీరు లేకుండా నాలుగేళ్ల చిన్నారి రెండు రోజులు అడవిలో ఉండటం సాధ్యం కాదని చెబుతున్నారు. చిన్నారి తీవ్రమైన షాక్‌లో ఉన్నందున ఆమె స్థిమిత పడిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటామంటున్నారు. ఆమెను అపహరించిన తర్వాత స్థానికులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం, వందలాది మంది గ్రామస్తులు అడవిలోకి తరలి రావడంతో అగంతుకులు భయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు.  చిన్నారి చెబితే తప్ప ఈ వ్యవహారంలో ఏమి జరిగిందో తెలియదని, భయపడిపోతుండటంతో  వెంటనే విచారించలేమన్నారు. రెండు రోజుల తర్వాత చిన్నారి అచూకీ లభించడంతో  తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. పోలీసుల విస్తృత గాలింపుతో  బాలిక క్షేమంగా దొరకడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

Whats_app_banner