Telangana News | తెలంగాణలో ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమం ప్రారంభం-ehealth profile launched in telanganas mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News | తెలంగాణలో ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమం ప్రారంభం

Telangana News | తెలంగాణలో ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమం ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Mar 05, 2022 12:05 PM IST

తెలంగాణలో ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. అది కూడా గిరిజన జిల్లా అయిన ములుగులో దీనిని ప్రారంభించడం గమనార్హం.

<p>ములుగులో శనివారం ఈ-హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రులు హరీష్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్</p>
ములుగులో శనివారం ఈ-హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రులు హరీష్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

ములుగు: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించే ఉద్దేశంతో ములుగు జిల్లాలో శనివారం ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ గిరిజన జిల్లాలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం అరుదైన రికార్డు అని ఈ సందర్భంగా మంత్రులు అన్నారు. 

ఇదొక ప్రతిష్టాత్మక కార్యక్రమం అని హరీష్‌ రావు అన్నారు. ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమమని చెప్పారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో 40 రోజుల్లో అందరి ఆరోగ్య వివరాలు సేకరించి ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులను జారీ చేయనున్నట్లు చెప్పారు. దీనిద్వారా అందరి ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉండి.. మెరుగైన వైద్యం వేగంగా అందే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ములుగులో రూ.42 కోట్లతో జిల్లా హాస్పిటల్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎంజీఎం హాస్పిటల్‌లో ఉన్న అన్ని వసతులు ఇప్పుడు మారుమూల ములుగు జిల్లాలో ఉన్నాయని హరీష్‌ రావు తెలిపారు. ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌లో భాగంగా ఇంటికెళ్లి మందులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. అన్ని తెలంగాణ పథకాల్లాగే ఇది కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఇక ఈ-హెల్త్‌ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం కోసం ములుగు జిల్లాను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇది గిరిజనుల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లోని కోటీశ్వరులకు ఉండే వైద్య సదుపాయాలు ఇప్పుడు ములుగు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని ఆమె అన్నారు. ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ కోసం ములుగులో రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావులకు మనమంతా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఎర్రబెల్లి అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలను కాపాడే ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ కవిత అన్నారు. తమ జిల్లాకు మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వాలని, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై మంత్రులు స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

Whats_app_banner