Pawan Kalyan | ఫోన్ లైట్ వెలుతురులో ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు, ప్రసవాలు-pawan kalyan comments on ysrcp govt over power cuts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan | ఫోన్ లైట్ వెలుతురులో ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు, ప్రసవాలు

Pawan Kalyan | ఫోన్ లైట్ వెలుతురులో ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు, ప్రసవాలు

HT Telugu Desk HT Telugu
Apr 08, 2022 08:52 PM IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతోనే.. విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు.

<p>పవన్ కల్యాణ్</p>
పవన్ కల్యాణ్ (twitter)

పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8గంటలు, నగరాల్లో 4 నుంచి 6గంటలు చొప్పున అనధికార విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఫోన్ వెలుతురులో.. ప్రసవాలు, శస్త్రచికిత్సలు చేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికి.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని చెప్పారు.

'రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉండేది. 2014-19 మధ్య విద్యుత్‌ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. ఒకటి రెండు సందర్భాల్లో విద్యుత్‌ ఛార్జీలు పెంచినప్పుడు కడియం ప్రాంత రైతులు వచ్చి భారం మోయలేమని గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్‌ పర్చేజి అగ్రిమెంట్లు రద్దు చేసింది.' అని పవన్ కల్యాణ్ అన్నారు.

యూనిట్‌ ధర.. రూ.4.80 చొప్పున 25 ఏళ్లపాటు గ్రీన్‌ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. యూనిట్‌ రూ.2లకే గ్రీన్‌ ఎనర్జీ తీసుకొస్తామని చెప్పారన్నా్రు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని.. కోల్‌ ఎనర్జీని రూ.20లు పెట్టి కొంటున్నారని పవన్ తెలిపారు.

ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లు ఖర్చవుతుంది. మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు విద్యుత్‌ ఛార్జీలు భారంగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారు. విద్యార్థులు, పరీక్షలకు సన్నద్ధమవుతున్నది కనిపించట్లేదా? విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రలేక ఒత్తిడికి గురవుతున్నారు. పరిశ్రమలకు వారాంతంలో ఒక రోజంతా విద్యుత్‌కోతలు అమలు చేస్తున్నారు. మళ్లీ తాజాగా మరో రోజు వపర్‌ హాలిడే ప్రకటించారు. దీంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయి.

- పవన్ కల్యాణ్

ప్రభుత్వ నిర్ణయంతో.. రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన పారిశ్రామిక వేత్తలు విద్యుత్‌ కోతలతో నష్టాల పాలవుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌లో ఇక పై 50శాతం మాత్రమే వాడాలనే నిబంధన విధించారని మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలిగేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని.. పవన్ అన్నారు. లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుందని చెప్పారు.

ప్రజలను పల్లకి ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని స్థాపించినట్టు పవన్ చెప్పారు. వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి.. పెరిగిన విద్యుత్‌ ఛార్జీల వరకు ప్రజల పక్షాన నిలబడుతామన్నారు. ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడితే తనను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారని పవన్ అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అని పవన్ స్పష్టం చేశారు. విద్యుత్ సంక్షోభంపై జనసైనికులు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపువిచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం