Godavari Floods : గోదావరి నదికి పెరుగుతున్న వరద-floods continues to godavari river ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Godavari Floods : గోదావరి నదికి పెరుగుతున్న వరద

Godavari Floods : గోదావరి నదికి పెరుగుతున్న వరద

HT Telugu Desk HT Telugu
Sep 12, 2022 05:27 PM IST

Godavari Floods In Bhadrachalam : ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా గోదావరి నదికి వరద ప్రహవాం పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

గోదావరి వరదలు
గోదావరి వరదలు (HT_PRINT)

వరద ముప్పు నేపథ్యంలో గోదావరి నది ఒడ్డున ఉన్న జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎగువ నదీ తీర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 9 లక్షల క్యూసెక్కులకు చేరుతోందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సచివాలయంలో వెంటనే కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి అంతటా ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. శ్రీరాంసాగర్ దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు 35 క్రెస్ట్ గేట్లను తెరిచారు. శ్రీరాం సాగర్‌కు 2.06 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతోంది.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. 36.1 అడుగులకుపైనే ప్రవాహం కొనసాగుతోంది. ఇలానే కొనసాగితే.. మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండుసార్లు గోదావరికి వరదలు భారీగా వచ్చాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు వరద రోజురోజుకు పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Rains in Telangana : మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో సెప్టెంబర్‌ ఎన్నడు కురవని స్థాయిలో కుంభవృష్టి కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 35.1సెం.మీల వర్షపాత నమోదైంది. రాజన్న జిల్లా అవునూర్‌లో 20.8, మర్తనపేటలో 20.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మెదక్‌, రంగారెడ్డి, నిజమాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

మెదక్ జిల్లా అల్లదుర్గంలో 18.4సెం.మీ, నిజామాబాద్‌ నవీపేటలో 17.6 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో 12.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాన వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత పదేళ్లలో సెప్టెంబర్‌లో 24గంటల వ్యవధిలో 35.1 సెం.మీ వర్షం కురవడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ చెబుతోంది. 2019 సెప్టెంబర్ 18న నల్గొండలో 21.8 సెం.మీల వర్షపాతం కురిసింది. వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై కుంభవృష్టి కురుస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తెలంగాణలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో కొత్త రికార్డులు ఏర్పడ్డాయి. 1908 నుంచి ఇప్పటి వరకు 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం ఖమ్మం జిల్లా కోహెడలో నమోదైంది. 1996 జూన్‌ 17న 67.5 సెంటిమీటర్ల వర్షపాతం, 1983 అక్టోబర్ 6న నిజామాబాద్‌లో 35.5సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆళ్ళపల్లిలో ఆదివారం 35.1 సెం.మీల వర్షపాతం నమోదైంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం