Miryalguda Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం-fatal road accident in miryalaguda five people died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Miryalguda Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Miryalguda Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Sarath chandra.B HT Telugu
Published Jan 29, 2024 06:27 AM IST

Miryalguda Accident: మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో నందిపాడు మండలానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.

మిర్యాలగూడ ఆస్పత్రిలో క్షతగాత్రులు
మిర్యాలగూడ ఆస్పత్రిలో క్షతగాత్రులు

Miryalguda Accident: దైవదర్శనం చేసుకుని వస్తున్న వారు మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానానికి చేరే వారు. అంతలో విధి వక్రీకరించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ మార్గంలో వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కృష్ణాజిల్లా మోపిదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణ మానస కాలనీ బైపాస్‌ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఓ లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.

ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుకుపల్లి మహేశ్‌ (32), ఆయన భార్య జ్యోతి(30), కుమార్తె రిషిత(6), మహేష్‌ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లి గ్రామానికి చెందిన బొమ్మ మహేందర్‌(32), అతని కుమారుడు లియాన్సీ(2) అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్‌ భార్య బొమ్మ మాధవి తీవ్రంగా గాయపడ్డారు.

మాధవిని మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ టూటౌన్‌ ఎస్సై క్రిష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు ఎస్సై తెలిపారు.

చెరుకుపల్లి మహేశ్‌ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. మహేశ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులోని విజయవాడ దుర్గగుడి, మోపిదేవి ఆలయాలకు దైవదర్శనానికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ వెనుక వస్తున్న లారీ దానిపై దూసుకువెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో రెండుకిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంటికి చేరుకునే వారు. ఈలోగా లారీ రూపంలో రావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో వారి కుటంబాల రోదనలు మిన్నంటాయి.

Whats_app_banner