ED Raids In HYD : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు
Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు దూకుడు పెంచుతున్నారు. తాజాగా మరోసారి హైదరాబాద్ లో సోదాలు చేశారు.
ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. కరీంనగర్(Karimnagar) జిల్లాకు చెందిన వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో గంటల పాటు ప్రశ్నించారు. ఈ దర్యాప్తులో కీలక సమాచారం రాబట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లో నాలుగు విడతల సోదాలు జరిగాయి. తాజాగా మరోసారి ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో నిందితుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో అభిషేక్ రావు సీబీఐ కస్టడీ పొడిగించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. సమీర్ మహీంద్రు, విజయ్ నాయర్‌లను అదుపులోకి తీసుకుంది. లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయినపల్లి అభిషేక్ బ్యాంకు ఖాతా నుంచి మీడియా సంస్థ ఖాతాకు నగదు బదిలీ జరిగినట్టుగా ప్రచారం ఉంది. మనీలాండరింగ్ కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
దిల్లీలో లిక్కర్ టెండర్లు దక్కించుకునేందుకు ఈ ముఠా నగదు లావాదేవీలు జరిపినట్లు సీబీఐ(CBI) అభియోగాలు నమోదు చేసింది. ఇండో స్పిరిట్స్ డైరెక్టర్ గా ఉన్న సమీర్ మహీంద్రుతో కలిసి రామచంద్ర పిళ్లై ఒప్పందాలు చేసుకున్నారని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ కేసులో తదుపరి అరెస్టు ఎవరు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
సంబంధిత కథనం