Double Decker Buses In HYD : త్వరలో హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు
TSRTC Double Decker Buses : భాగ్యనగరంలో ఇకపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు కనిపించనున్నాయి. అప్పట్లో ఉండేవి.. ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపై తిరగనున్నాయి. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.
ఆర్టీసీ(RTC) సేవలను జనాలు పెద్ద ఎత్తున వినియోగించుకునేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. డబుల్ డెక్కర్(Double Decker) బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచిస్తోంది. కానీ నిధుల కొరత కారణంగా ఆలోచిస్తోంది. గతంలోనూ ఈ విషయంపై కేటీఆర్ హామీ ఇచ్చారు. త్వరలో హైదరాబాద్ రోడ్లపై 10 కొత్త ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అనుకుంటోంది. ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ధర రూ. 2.25 కోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ప్రస్తుతం వాటిని కొనుగోలు చేయలంటే కష్టం. మెుదట వాటిని అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని TSRTC యాజమాన్యం అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో టెండర్ల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు క్రాస్-కాస్ట్ మోడల్ కింద ముందుకు రావాలని కోరనున్నారు. టెండర్ పొందిన సంస్థ అద్దె ప్రాతిపదికన బస్సులను నడిపే సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సులను టీఎస్ఆర్టీసీ(TSRTC)కి సరఫరా చేయాలి. కంపెనీకి కిలోమీటరు ఛార్జీల ఆధారంగా నిర్ణీత అద్దెను చెల్లిస్తుంది.
డబుల్ డెక్కర్ బస్సుల విషయంపై కొన్ని రోజుల కిందట చర్చ జరిగింది. హైదరాబాద్(Hyderabad)లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టాలని గతంలో ఓ వ్యక్తి కేటీఆర్(KTR)ను ట్విట్టర్ ద్వారా అడిగాడు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్‌కు చెప్పారు.
అదే సమయంలో సాధారణ డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలుకు టెండర్లు(Tenders) కూడా పిలిచారు. అశోక్ లేలాండ్ కాంట్రాక్ట్ పొందింది. రాష్ట్రంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందలేదు. దీంతో వాటిని అద్దె ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ నిధుల కొరత కారణంగా ఇది కూడా నిలిచిపోయింది. అయితే తాజాగా రూ.9కోట్ల వరకు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం.
ఆర్టీసీ అధికారులు నిర్వహించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం ప్రకారం పటాన్‌చెరు-కోఠి (218), జీడిమెట్ల-సీబీఎస్ (9X), అఫ్జల్‌గంజ్-మెహిదీపట్నం (118) రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపే అవకాశం ఉంది.