Vijayawada- Vizag: డబుల్ డెక్కర్ రైలు పునరుద్ధరణ.. ఆ రోజు నుంచే
విశాఖ-విజయవాడ డబుల్ డెక్కర్ రైలును ఏప్రిల్ 13 నుంచి పునరుద్దరిస్తున్నారు. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రకటించారు.
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన విశాఖపట్టణం-విజయవాడ డబుల్ డెక్కర్ రైలును ఏప్రిల్ 13 నుంచి పునరుద్దరిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఉదయ్ రైళ్లలో భాగంగా ప్రారంభించిన ఏసీ డబుల్ డెక్కర్ సర్వీస్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేది. ఒక్క రోజులో పనులు ముగించుకుని వచ్చే వారికి వీలుగా ఈ రైలు నడిచే వేళల్ని నిర్ణయించారు. వారానికి ఐదు రోజులు నడిచే 22701 సర్వీసు విశాఖపట్నంలో ఉదయం 5.25కు బయలు దేరి 11గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం ఐదున్నరకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
సోమ, మంగళ, బుధ, శుక్ర, శని వారాల్లో ఈ రైలు సేవలందిస్తుంది. ఉదయ్ డబుల్ డెక్కర్ సర్వీసుకు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరులలో ఆగుతుంది. ప్రయాణ సమయం తక్కువ కావడంతో ప్రారంభం నుంచి ఈ రైలు మంచి ఆదరణ లభించింది. కొన్నాళ్లుగా నిలిచిపోయిన సర్వీసును పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.