Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు అరెస్ట్….
Delhi liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కాంవ్యవహారంలో మరొకరిని సిబిఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ రావును అరెస్ట్ చేసిన సిబిఐ, హైదరాబాద్ నుంచి ఢిల్లీకు తరలిస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీని ప్రభావితం చేసేలా కుట్ర పన్నారనే ఆరోపణలపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లు గత నెలన్నరగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బోయిన్‌పల్లి అభిషేక్‌రావును సిబిఐ అరెస్ట్ చేసింది.
Delhi liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ రావును సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే విజయ్ నాయర్ అరెస్ట్ కాగా తాజాగా అభిషేక్ రావును సిబిఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్టిలరీస్‌లో అభిషేక్ డైరెక్టర్‌గా ఉన్నారు. రామచంద్రన్ పిళ్లైతో కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగు చూసిన వెంటనే దాని మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ నాయకుల పేర్లను బీజేపీ నేతలు ప్రస్తావించారు. ఏపీ తెలంగాణలకు చెందిన పలువురు నాయకుల పేర్ల ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో తెరపైకి వచ్చాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో జరిపిన చెల్లింపుల్లో హైదరాబాద్‌కు చెందిన డిస్టిలరీలు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్‌లోని అనూస్ బ్యూటీ పార్లర్ ఆవరణలో రాబిన్ డిస్టిలరీస్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ కంపెనీకి చెందిన రామచంద్రన్ పిళ్లైకు లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతనితో పాటు కంపెనీ డైరెక్టర్ల నివాసాలపై సిబిఐ, ఈడీలు ఏకకాలంలో దాడులు జరిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల్లో ఒకరైన వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి తీసుకుంది. సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ కేసులో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తోనూ సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో నేరుగా ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోకాపేటలోని అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంతో పాటు అభిషేక్ రావు డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్ మాదాపూర్‌లోని అనూస్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్‌లోనూ ఈడి గతంలోనే సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 100 కు పైగా ప్రాంతాల్లో దాడులు, సోదాలు నిర్వహించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు సెప్టెంబర్ 17న అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandran Pillai) ను సుమారు 7 గంటల పాటు విచారించింది. అతను ఇచ్చిన వివరాల ఆధారంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావు (Vennamaneni Srinivasa Rao) ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. సోదాల అనంతరం శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. శ్రీనివాసరావు నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం సేకరించారు.
తెలంగాణలోని ముఖ్య నేతలతో శ్రీనివాసరావుకు సత్సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ఛార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchi Babu), గండ్ర ప్రేమ్‌సాగర్ రావు, బోయిన్‌పల్లి అభిషేక్ రావు, అభినయ్ రెడ్డి ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరంతా కలిసి ఢిల్లీ పెద్దలకు రూ.2.40కోట్లను ముడుపులుగా చెల్లించినట్లు సిబిఐ గుర్తించింది. ఢిల్లీ ముడుపుల చెల్లింపు వ్యవహారంలో అభిషేక్ రావు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించిన సిబిఐ అతడిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించింది.