Delhi Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ అదనపు ఛార్జిషీటు..మళ్లీ తెరపైకి ఎమ్మెల్సీ కవిత-ed files supplementary chargesheet in delhi liquor scam case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ed Files Supplementary Chargesheet In Delhi Liquor Scam Case

Delhi Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ అదనపు ఛార్జిషీటు..మళ్లీ తెరపైకి ఎమ్మెల్సీ కవిత

HT Telugu Desk HT Telugu
May 02, 2023 09:19 AM IST

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఈడీ అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత పేరును తాజా ఛార్జిషీటులో ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్‌ మద్యం సిండికేట్ వ్యవహారాల్లో మాగుంట రాఘవ్ కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వెంటాడుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సోమవారం స్పెషల్ కోర్టులో ఈడీ అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వాటిలో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. కవిత బినామీగా అరుణ్‌పిళ్లై భూములు కొన్నట్లు వెల్లడించింది. సౌత్ గ్రూప్ పేరిట ఏర్పాటైన మద్యం సిండికేట్‌లో మాగుంట రాఘవ్‌ కీలకమని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణఫం కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు దిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అభియోగాలపై ఈ నెల 10న విచారణ చేపట్టనున్నట్లు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ప్రకటించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో సేకరించిన అదనపు ఆధారాలతో ఈడీ ఏప్రిల్‌ 6న, 27వ తేదీలలో అనుబంధ ఛార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన సమీర్‌ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి, అమిత్‌ అరోడా, గౌతమ్‌ మల్హోత్రా, రాజేష్‌ జోషి, రాఘవ్‌ మాగుంట, అమన్‌ ధల్‌, అరుణ్‌పిళ్లై, మనీష్‌ సిసోదియాల పాత్ర గురించి ఈడీ తాజా అభియోగ పత్రాల్లో వివరించింది.

లిక్కర్ కేసుతో సంబంధమున్న 38 మంది నుంచి సేకరించిన వాంగ్మూలాలను పొందు పరిచినట్లు ఈడీ తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టుకు తెలిపారు. 27న సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఇండోస్పిరిట్‌ సంస్థతో ఎమ్మెల్సీ కవితకున్న సంబంధం గురించి వివరించింది.

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కొడుగు మాగుంట రాఘవ్, శరత్‌చంద్రారెడ్డి, కవితల నేతృత్వంలోని సౌత్‌గ్రూప్‌, ఆప్‌ నేతల ప్రతినిధి విజయ్‌నాయర్‌కు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిందని, దానికి ప్రతిఫలంగా వచ్చిన లాభాలను కవిత తన ప్రతినిధి అరుణ్‌పిళ్లై ద్వారా హైదరాబాద్‌లో భూముల కొనుగోలుకు వినియోగించారని ఈడీ పేర్కొంది.ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వ్యక్తులు దిల్లీ, హైదరాబాద్‌ల్లోని వివిధ ప్రాంతాల్లో సమావేశమైన తేదీలు, వారి మధ్య నడిచిన కాల్‌ రికార్డులు, వాట్సప్‌ సంభాషణలను జతచేసింది.

కవితకు బినామీగా అరుణ్ పిళ్లై…

అరుణ్‌పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు తదితరులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ వివరాలను పొందుపరిచింది.''సౌత్‌ గ్రూప్‌- ఆమ్ ఆద్మీ నేతల మధ్య కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగానే రూ.100 కోట్లను ఆప్‌ ప్రతినిధి విజయ్‌నాయర్‌కు అడ్వాన్సుగా చెల్లించారని ఈడీ ఆరోపించింది. ఈ కారణంగానే పాత మద్యం విధానంలో హోల్‌ సేలర్స్‌కి ఉన్న 5% మార్జిన్‌ను కొత్త విధానంలో 12 శాతంగా ఖరారు చేశారు.

ఎల్‌-1గా వచ్చిన ఇండోస్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌లో అరుణ్‌పిళ్లైకి 35%, ప్రేమ్‌రాహుల్‌ మండూరికి 32.5% వాటా ఉంది. ఇందులో కవిత తరఫున అరుణ్‌పిళ్లై, మాగుంట శ్రీనివాసులురెడ్డి తరఫున ప్రేమ్‌రాహుల్‌ ప్రాతినిధ్యం వహించారని ఈడీ పత్రాల్లో పేర్కొంది. ఇండోస్పిరిట్‌లో వచ్చిన లాభాలను కవిత ఆదేశాల మేరకు అరుణ్‌పిళ్లై పెట్టుబడిగా మలిచారని ఈడీ వివరించింది. తాను ఫీనిక్స్‌ గ్రూప్‌నకు చెందిన శ్రీహరి నుంచి ఎన్‌గ్రోత్‌ క్యాపిటల్‌ పేరు మీదుగా ఆస్తిని కొన్నట్లు బుచ్చిబాబు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

ఫినిక్స్‌ గ్రూప్‌లో కె.కవిత, ఆమె భర్త డీఆర్‌ అనిల్‌కుమార్‌ భాగస్వాములుగా ఉన్నారు. కవిత ఫీనిక్స్‌ సంస్థ సీఓఓ శ్రీహరి నుంచి 25 వేల చదరపు అడుగుల మరో ఆస్తిని కొన్నారు. ఆమె ఆదేశాల మేరకు సంబంధిత దస్తావేజుల పనిని బుచ్చిబాబు చూశారని, ఈ ఆస్తి మార్కెట్‌ విలువ చదరపు అడుగుకు రూ.1,760 కాగా... రూ.1,260 మాత్రమే చెల్లించారని ఈడీ పేర్కొంది. వట్టినాగులపల్లిలోని క్రియేటివ్‌ డెవలపర్స్‌లో అరుణ్‌పిళ్లై రూ.5 కోట్లు పెట్టి 3-4 ఎకరాల భూమి కొన్నట్లు ఆ సంస్థ భాగస్వామి రవిశంకర్‌చెట్టి తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

ఈడీ దర్యాప్తు ప్రారంభమైన తర్వాతే అరుణ్‌పిళ్లై రిజిస్ట్రేషన్‌కు వచ్చారని క్రియేటివ్‌ డెవలపర్స్‌ ఉద్యోగి రవివర్మరాజు తన స్టేట్‌మెంట్‌లో చెప్పారు. ఈ భూమిని కవిత ఆదేశాల మేరకే అరుణ్‌పిళ్లై బినామీ కింద కొన్నారని ఈడీ ఆరోపించింది. 2022 మే నుంచి రిజిస్టర్‌ కాని ఈ భూమి అకస్మాత్తుగా అదే సంవత్సరం అక్టోబరు 11న అరుణ్‌పిళ్లై భార్య పేరిట రిజిస్టర్‌ అయిందని, ఆ భూమి పిళ్లైదే తప్ప కవితది కాదని న్యాయపరంగా చెప్పడానికే ఆ పని చేశారని అని ఈడీ అనుబంధ ఛార్జిషీట్‌లో వివరించింది.

దిల్లీ ఎయిర్‌ పోర్టులో లిక్కర్‌ స్టోర్‌ ఏర్పాటుకు ప్రయత్నం..

లిక్కర్‌ సిండికేట్‌లో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్‌ మాగుంట కీలకపాత్ర పోషించినట్లు ఈడీ అనుబంధ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ''రాఘవ్‌ మాగుంట చెన్నైలోని ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్‌ అనే మద్యం తయారీ సంస్థను నిర్వహిస్తున్నారు.

దిల్లీలో మాగుంట ఆగ్రో ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రెండు రిటైల్‌ జోన్లను దక్కించుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం ప్రకారం మద్యం తయారీదారులు రిటైల్‌, హోల్‌సేల్‌ బిజినెస్‌ చేయకూడదు. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ప్రపంచ స్థాయి మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి మాగుంట శ్రీనివాసులురెడ్డి జీఎంఆర్‌కు వాట్సప్‌ సందేశం పంపారు. వ్యాపారంలో భాగస్వామిగా మారి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరారు. మాగుంట రాఘవ్‌ సైతం జీఎంఆర్‌ ప్రతినిధి బీవీనాగేశ్వరరావును సంప్రదించి దుకాణం ఏర్పాటుకు ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఓసీ కోసం ప్రయత్నించారు.ఈ ప్రయత్నాలు ఫలించలేదు.

ఇండోస్పిరిట్‌ సంస్థను నిజమైన సంస్థగా చూపించి, మద్యం విధానం ద్వారా సంపాదించిన రూ.192 కోట్ల ఆర్జనను, న్యాయబద్ధంగానే సంపాదించినట్లు చూపించే ప్రయత్నం చేశారని ఈడీ ఆరోపించింది.

లిక్కర్ స్కామ్ డబ్బులతో హైదరాబాద్‌లో భూములు…

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్‌ గ్రూపుదే కీలకపాత్ర అని పేర్కొంది. భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కుమార్‌ ప్రమేయం ఉందని ఆరోపించింది. గౌతమ్‌ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్‌ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను సోమవారం ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది.

మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుల్ని కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ కోరింది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఈడీ చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. చార్జిషీట్లలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్, శరత్‌చంద్రారెడ్డి, కవిత సన్నిహితుడు వి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్, ఫీనిక్స్‌ గ్రూపు, ఎన్‌గ్రోత్‌ క్యాపిటల్, క్రియేటివ్‌ డెవలపర్స్‌ తదితరుల పేర్లను ప్రస్తావించింది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా అసాధారణ అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పింది.

WhatsApp channel